పెరుగుతున్న ఎండలు..! జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు..! ఎండాకాలం గడిచేది ఎలా..?
Recommended Video
హైదరాబాద్ : ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఎండ తీవ్రత పెరుగుతుండటం భయాందోళనలకు గురిచేస్తోంది. ఇంకా రోహిణి కార్తె రాలేదు. అప్పుడే భానుడి భగభగలు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేని ప్రజలు, ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ సీజన్ లో హైదరాబాద్ లో తొలిసారిగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరెంట్ కు డిమాండ్ పెరిగింది. దాహార్తిని తీర్చుకునేందుకు ప్రజలు శీతలపానియాలు తీసుకుంటూ సేదతీరుతున్నారు.

భగభగ మండుతున్న ఎండలు..! విలవిలలాడుతున్న జనం..!!
మధ్యాహ్నం వేళల్లో వీధులు బోసిపోతుండగా, పలు పర్యాటక ప్రాంతాలు సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో ఎండలు అధికంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, నిజామాబాద్, రామగుండం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఎండలో దూరప్రయాణాలను వెళ్లకుండా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

జలాశయాల్లో తగ్గుతున్న నీటిమట్టం..!!
త్రాగునీటికి కటకట..! జలాశయాల్లో తగ్గుతున్న నీటిమట్టం..!!
నాగార్జునసాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరడం, మంచినీటి కోసం తమ వాటా నీటిని కేటాయించాలంటూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరగుతోంది. ఈ మేరకు రెండు రాష్ట్రప్రభుత్వాలకు సమాచారం అందింది. తమకు 15 టిఎంసిల నీటిని ఇవ్వాలని ఆంధ్ర, 12 టిఎంసి నీటిని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాలు కృష్ణా బోర్డును డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 804 అడుగుల నీటి మట్టంలో కేవలం 31.04 టిఎంసి నీరు, నాగార్జున సాగర్‌లో 506.3 అడుగుల నీటిమట్టం వద్ద 125.18 టిఎంసి నీరు ఉంది.

ఉగ్ర రూపం దాల్చుతున్న ఎండలు..! ఉక్కిరిబిక్కిరౌతున్న ప్రజలు..!!
మరో వారం రోజుల్లో శ్రీశైలంలో 800 అడుగులు, నాగార్జునసాగర్‌లో 500 అడుగులకు నీటి మట్టం చేరుతాయని సాగునీటి ఇంజనీర్లు తెలిపారు. కాగా ఒక కోటి జనాభా ఉన్న హైదరాబాద్ పరిసరాల్లోని ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా నాగార్జునసాగర్‌లో పుట్టంగండి వద్ద నీటిని తోడేందుకు 7 అత్యవసర పంపులను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో మూడు పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పంపులను ఏర్పాటు చేస్తే తప్ప డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉన్న నీటిని తోడి హైదరాబాద్ పరిసరాల ప్రజలకు మంచినీటిని సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది.

నీటి నిల్వల గురించి అదికారులది ఓ లెక్క..! క్షేత్ర స్థాయిలో మరో లెక్క..!!
ఈ పంపుల ద్వారా సగటున రోజుకు 270 మిలియన్ గ్యాలన్స్ ను హైదరాబాద్‌కు పంపిస్తారు. ఈ నీటిని కృష్ణా వాటర్ సప్లై స్కీం కింద 1,2,3 దశల్లో ఉన్న ప్రాంతాల్లోకి మంచినీటిని సరఫరా చేస్తారు. మరో మూడు నెలలపాటు అంటే నాగార్జున సాగర్ నీటి మట్టం 496 అడుగులకు వచ్చేవరకు ఈ పంపుల ద్వారా నీటిని తోడుతారు. దీనివల్ల వచ్చే మూడు నెలల పాటు మంచినీటికి ఇబ్బంది ఉండదని అదికారులు చెప్పుకొస్తున్నప్పటి క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదని, త్రాగునీటికి కటకట పరిస్థితిని ఎదుర్కోవాల్సొస్తుందని నగర వాసులు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications