రేవంత్ సర్కార్ పై హమాలీల సమర శంఖం!
తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ పైన హమాలీలు కదం తొక్కుతున్నారు. సమర శంఖం పూరించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు వరంగల్ నగరంలో మార్చి 15వ తేదీన హమాలీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హమాలీ మహా గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమం హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించబడుతుందని యూనియన్ నేతలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా హమాలీల సమస్యలు
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో హమాలీలు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.యూనియన్ నాయకుల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న హమాలీలు ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దినసరి కూలీ పనిపై ఆధారపడే ఈ వర్గానికి సరైన గుర్తింపు లేకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, వైద్య సదుపాయాలు మరియు సామాజిక భద్రతా పథకాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వారు తెలిపారు.

ఎన్నికల సమయంలో హమాలీలకు కాంగ్రెస్ హామీ
ఎన్ని సంవత్సరాలైనా హమాలీల బ్రతుకులలో మార్పులు రావడం లేదన్నారు. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లినప్పటికీ సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హమాలీల కోసం హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ నేతలు గుర్తుచేశారు.
హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్
ఆ హామీపై ఆశలు పెట్టుకున్న హమాలీలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారని, కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని వారు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని వారి డిమాండ్ చేశారు. హమాలీలకు సామాజిక భద్రత, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు అందించాలని వారు చెబుతున్నారు.
హమాలీలకు కనీస వేతనాలకు డిమాండ్
అదేవిధంగా మార్కెట్ యార్డులు, గోదాములు మరియు ఇతర వాణిజ్య ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలీలకు కనీస వేతనాలు నిర్ధారించడంతో పాటు వారి పని పరిస్థితులను మెరుగుపర్చే చర్యలు తీసుకోవాలని తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. హమాలీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కానీ వారి కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
హమాలీ మహా గర్జన" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యూనియన్ నేతలు
ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్ల సాధన కోసం "హమాలీ మహా గర్జన" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూనియన్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ సమస్యలను స్పష్టంగా అలా అని వినిపించే అవకాశం ఉంటుందని ఇస్తున్నారు. హమాలీల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావడం ఈ మహా గర్జన కార్యక్రమం లక్ష్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications