"ఆదివారం రిపోర్టు పెట్టారంటేనే కుట్ర ఉన్నట్టు.. కాళేశ్వరం రిపోర్టు చిత్తు కాగితం అని.."
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో శాసన సభలో కాళేశ్వరం కమిషన్ పై చర్చ మొదలైంది. అలాగే జీవో నెం.49పై చర్చించారు. ఈ మేరకు 650 పేజీల పుస్తకం ఇచ్చి అరగంట మాట్లాడాలి అంటే ఎలా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. వరదలు, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరదలపై చర్చిద్దామని బీఏసీలో కోరామని, వరద సమస్య ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుందని చెప్పారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని హరీష్ రావు అన్నారు. కోర్టులో వాదనలు ఉన్నాయనే ఆదివారం కూడా చర్చ పెట్టారని.. పారదర్శకంగా విచారణ జరగకపోతే అవి చిత్తు కాగితంతో సమానమని కోర్టులు చెప్పాయని గుర్తు చేశారు.
"ఆదివారం రోజు సభలో నివేదిక పెట్టారంటేనే వారి ఉద్దేశం అర్థం అవుతోంది. కోర్టుకు వెళ్లడం అనేది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇలాంటి విషయాలపై ఇందిరాగాంధీ, అద్వాని కూడా కోర్టుకు వెళ్లారు.
తొందరగా ఆదివారం పెట్టారంటేనే మీ కుట్రలు అర్థం అవుతున్నాయి. మీరు చేసిందంతా పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగిందా లేదా.. తేలాలి. నిష్పాక్షికంగా జరగకపోతే ఆ కమిషన్ నివేదిక చిత్తుకాగితం అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆరోపణలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ లో స్పష్టంగా చెప్పారు. సభ్యులకు 8బి, 8సి కింద నోటీసులు ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉంది" అని హరీష్ రావు పేర్కొన్నారు. వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారని.. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్లలో నీరు అందుబాటులో ఉంది.. హైడ్రాలజీ అనుమతులు ఇస్తున్నామని ఆనాటి కేంద్ర మంత్రి ఉమా భారతి 24-10- 2014 న స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.
"205 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని లెటర్ రాస్తే.. హరీష్ రావు గారు మళ్లీ పరిశీలించాలని మళ్లీ లేఖ రాశారు. వీళ్ల తప్పుడు విధానాలతో మళ్లీ పరిశీలించాలని లేఖ రాశారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి సర్టిఫికెట్ తీసుకున్నాక మళ్లీ పరిశీలించాలని ఎవరైనా అడుగుతారా..? 2009 లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నీరు అందుబాటులో ఉందని అనుమతినిచ్చింది. ఈ రికార్డులను కావాలనే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో వాస్తవాలని బయటపెట్టారనే వారిపై విషం చిమ్ముతున్నారు. హరీష్ రావు తప్పు చేశారని నివేదికలోని పేజీ నెంబర్ 98 లో స్పష్టంగా పొందుపరిచారు. సీబీఐ కావాలా, సీబీ సీఐడీ కావాలా లేదా విచారణ కావాలో చెప్పకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అసంపూర్తి సమాచారంతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నా" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"హరీష్ చెప్పిన అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఆనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈనాటికీ మంత్రిగా ఉన్నట్టుగానే భావిస్తున్నారు. నీరు అందుబాటులో ఉందని చెప్పినా మళ్లీ పరిశీలించాలని లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించకుండా.. పేరు మార్చి ఊరు మార్చి దోపిడీకి పాల్పడ్డారు. 2014 లో నీరు అందుబాటులో ఉందని చెప్పిన విషయం దాచి 13 మార్చి 2015 న ఉమా భారతి లేఖను పట్టుకుని హరీష్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యాసాగర్ రావు బతికి ఉంటే వీళ్ల అబద్ధాలు వినలేక అదే కాళేశ్వరంలో దూకి ఆత్మహత్య చేసుకునేవారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారు" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

"నిజాం కంటే ధనవంతుడు కావాలన్న దుర్బుద్ధితో కేసీఆర్ ప్రాజెక్టు రీ- డిజైన్ చేశారు. మేడిగడ్డ దగ్గర కట్టాలని కేసీఆర్, హరీష్ ముందే నిర్ణయించుకున్నాకే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని నియమించారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక వారికి అనుకూలంగా లేదని ఆ నివేదికను తొక్కిపెట్టి వాళ్లు అనుకున్న చోట ప్రాజెక్టు కట్టారు. వీళ్ల ఉద్దేశమే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం. వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారు" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications