సిట్టింగ్ జడ్జితో విచారణ చెయ్.. దమ్ముంటే చంద్రబాబుపై యుద్ధం చెయ్ రేవంత్!
కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడంట అన్నట్టు ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వంద రోజుల్లో తాము అమలు చేస్తామని చెప్పిన గ్యారెంటీల గురించి మాట్లాడకుండా మూసి ప్రక్షాళన లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం
పాలమూరుకు ఏం చేశారని పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒరగబెట్టిందేమీ లేదని హరీష్ రావు విమర్శించారు. నిజానికి పాలమూరు బిడ్డలందరూ పనిమంతులని కానీ రేవంత్ మాత్రం మాటలు ఎక్కువ పని తక్కువ అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఎటువంటి ప్రాజెక్టుల పైన అవగాహన లేదని, ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.

వంచకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే
68% కృష్ణాపరివాక ప్రాంతం ఉన్న తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ల పాటు కృష్ణా జలాలు అందక అలమటించడానికి కారణం ఎవరు? ఆ పాపం ఎవరిది అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఎస్ ఎల్ బీ సి టన్నెల్ ప్రమాద ఘటన పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సిట్టింగ్ జడ్జితో ఎస్ఎల్ బిసి ప్రమాద ఘటనపైన విచారణకు డిమాండ్
మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన విషయాలను నిర్లక్ష్యం చేసి ఆదరాబాదరాగా ఎస్ఎల్బీసీ పనులు మొదలు పెట్టారని, కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యుకుహరం లోకి నెట్టారని మండిపడ్డారు. 8 మంది కార్మికుల ప్రాణాలు బలి తీసుకొని ఇప్పుడు కుహనా ఏడుపులు ఏడుస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే సిట్టింగ్ జడ్జితో ఎస్ ఎల్ బిసి ప్రమాద ఘటనపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఒర్రితే పనులు కావు రేవంత్ .. హరీష్ చురకలు
పచ్చి అబద్ధాలు మాట్లాడడం, నోటికి వచ్చినట్లు కారు కూతలు కూయడం మానుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఒర్రితే పనులు కావని, ఒళ్ళు వంచితేనే పనులవుతాయి అంటూ హరీష్ రావు తెల్చి చెప్పారు. 2014 నుంచి 2023 వరకు బిఆర్ఎస్ ప్రభుత్వం 3900 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎస్ఎల్బీసీ సొరంగం 11.48 km తవ్విన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
కృష్ణా జలాల విషయంలో పోరాటం చెయ్
ఇక రూపాయి ఖర్చు పెట్టకుండానే 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు జరిగాయా అంటూ ఆయన నిలదీశారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, నోటికొచ్చిన విమర్శలు చేయడం కాదు. దమ్ముంటే కృష్ణ జలాల విషయంలో చంద్రబాబుపై యుద్ధం చేయాలని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని హరీష్ రావు రేవంత్ రెడ్డికి సూచించారు.












Click it and Unblock the Notifications