Harish Rao: దేవుడిపై ఒట్టేసి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం..
సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్టేసి మాట తప్పారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. దేవుడిపై ఒట్టేసి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టమని పేర్కొన్నారు. యాదాద్రి నర్సన్న సాక్షిగా ఒట్టు వేసి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి శాపం తెలంగాణ ప్రజలకు తగలకుండా కాపాడాలని కోరుకున్నట్లు తెలిపారు. హరీశ్ రావు గురువారం యాదగిరిగుట్టలోని లకీష్మి నారసింహా స్వామిని దర్శించుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15లోపు రుణాలు ఉన్న రైతులందరికీ రైతు రుణ మాఫీ చేస్తామని యాదగిరిగుట్ట నరసింహాస్వామి ఒట్టు వేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. దేవుడిపై ఒట్టేసి రైతులను మోసం చేశారని విమర్శించారు. దేవుడిపై ప్రమాణం చేసి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని.. అందుకే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కీడు జరగకూడదని పాప పరిహార పూజలు చేసినట్లు చెప్పారు.

హరీశ్ రావు వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరి వెంకటేశ్వర్లు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బూడిద బిక్షమయ్య గౌడ్, బాలరాజు యాదవ్, క్యామా మల్లేష్, కర్రె వెంకటయ్య, శ్రీకర్ రెడ్డి, రవీందర్ గౌడ్ ఉన్నారు. మరోవైపు రైతులకు రుణ మాఫీ చేయాలని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నాలు చేపట్టింది.
అయితే ఇప్పటి వరకు చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. వారంతా వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం తమకు పై నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తమకు రుణ మాఫీ అవుతుందా కాదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రుణ మాఫీ చేసినట్లుగా ప్రకటించుకుంటున్నారు. ఎవరికైనా రుణ మాఫీ కాకుంటే చేస్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications