టిడిపి పేచీపై హరీష్: మెట్రో రైలుపై కెసిఆర్ రివ్యూ
హైదరాబాద్: శాసనసభ ఆవరణలో గదుల కేటాయింపు పేచీపై తెలంగాణ శాసనసభ ావ్యవహారాల మంత్రి టి. హరీష్ రావు స్పందించారు. గదుల కేటాయింపుపై తెలుగుదేశం పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆయన మంగళవారంనాడు అన్నారు. తాము కేటాయించిన గదులు కాకుండా వేరేవి కావాలని తెలుగుదేశం పార్టీ పేచీ పెడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే శాసనసభలో గదుల కొరత ఉందని ఆయన చెప్పారు.
అసెంబ్లీలో తమకు కేటాయించిన గదిని మార్చాలని టిడిపి శాసనసభ్యులు మంత్రి హరీష్ రావును కోరారు. అయితే, అది సాధ్యం కాదని ఆయన చెప్పారు. దాంతో టిడిపి ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. గదులు మార్చాలంటే అడగాలి గానీ నిరసన తెలియజేయడం సరి కాదని హరీష్ రావు అన్నారు.

కాగా, హైదరాబాద్ మెట్రో రైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మెట్రో రైలు అధికారులతో పాటు మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ కూడా పాల్గొన్నారు. పాతబస్టీలో మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్పుపై ఈ సమావేశంలో చర్చించారు.
హైదరాబాదులోని మూడు చోట్ల మెట్రో రైలు మార్గాన్ని మార్చాలని కెసిఆర్ ఎల్ అండ్ టీకి సూచించిన విషయం తెలిసిందే. పాతబస్తీలో ఓ చోట కూడా దాని మార్గాన్ని మార్చడానికి కెసిఆర్ ప్రతిపాదన చేశారు. మెట్రో రైలు మార్గంలో ప్రార్థనా మందిరాలు, చారిత్ర కట్టడాలు ఉండడంతో వాటి పరిరక్షణకు అలైన్‌మెంట్ మార్చాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ సమీక్ష చేశారు.












Click it and Unblock the Notifications