హరీశ్ రావు.. రాజీనామా చెయ్.! లేదంటే.?: బీఆర్ఎస్ బతుకు బస్టాండే అంటూ రేవంత్
మాజీ మంత్రి హరీశ్ రావు తోపాటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలోని వైరాలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్ అడ్డ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, రైతు రుణమాఫీపై సవాల్ విసిరిన హరీశ్ రావు ఇప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ చేయలేరని.. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు. ఇప్పుడు రుణమాఫీ అమలు చేశాం. హరీశ్ రావు రాజీనామా చేయాలి లేదంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. తాను విసిరిన సవాల్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు హరీశ్ రావు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

హరీశ్ రావుకు సిగ్గుంటే రాజీనామా చేయాలని.. దీంతో సిద్దిపేటకు పీడ విరుగడువుతుందని రేవంత్ దుయ్యబట్టారు. మే 6, 2022న కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ చేసిందని. .ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేసిందన్నారు. వరంగల్ వేదికగా తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. ఇచ్చిన హామీ మేరకు రూ. 31 వేల కోట్లతో రుణమాఫీ చేశామని రేవంత్ తెలిపారు.
2026 , ఆగస్టు 15 లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. తాము నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు కటిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్‌లు తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వస్తే.. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదని.. అయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధిరాలేదని రేవంత్ దుయ్యబట్టారు. ఇక బీఆర్ఎస్ బతుకు బస్టాండే అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు, బీజేపీపైనా విమర్శలు గుప్పించారు రేవంత్. బీజేపీకి 8 ఎంపీ సీట్లిస్తే. తెలంగాణకు మోడీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో అన్ని అంశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమని.. తమ ప్రభుత్వం నుంచి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారన్నారు. ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమంటూ కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లకు సవాల్ విసిరారు. హరీశ్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటలో ఎలా గెలుస్తారో చూస్తానని రేవంత్ అన్నారు.












Click it and Unblock the Notifications