ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు: సవాల్ విసిరిన హరీశ్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలు అభివృద్ధి నిరోధకంగా మారాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్ జిల్లాలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పారదర్శకతతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని స్పష్టం చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటును అడ్డుకునేందుకు కోర్టు వెళ్తామని కాంగ్రెస్ నేతలు అనడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టుకు వెళ్లి కొత్త జిల్లాలను అడ్డుకుంటే ఆయా నేతలను గ్రామాల్లోకి రానివ్వొద్దని ప్రజలను సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేసీఆర్‌కు మంచిపేరు వస్తోందన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ నేతలు దురుద్దేశంతో జిల్లాల ఏర్పాటును అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చాలా శాస్త్రీయంగా జరుగుతోందని చెప్పిన మంత్రి జిల్లాల ఏర్పాటుపై సిద్దిపేట, జగిత్యాల చౌరస్తాలో చర్చలకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కొత్త జిల్లాల ఏర్పాటుని అడ్డుకుంటే ప్రజలు క్షమించరని అన్నారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిద్ధిపేట జంక్షన్‌కు వచ్చి జిల్లా ఏర్పాటు కావాలా? వద్దా అని మీ పార్టీ నేతలను అడిగితే వారే సమాధానం చెబుతారని అన్నారు. 50 ఏళ్ల సిద్ధిపేట జిల్లా కలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఇలాగే వ్యవహరిస్తే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.
కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నుంచి వైఎస్ వరకు, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని దుయ్యబట్టారు. జిల్లాల ఏర్పాటును అడ్డుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ నేతలను నిలదీయాలని ప్రజలకు సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications