నేడు సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటీషన్ విచారణ.. సర్వత్రా ఉత్కంఠ!!
నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు జారీ చేయడాన్ని ఎమ్మెల్సీ కవిత దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికే కవిత పిటిషన్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం తమ వాదన వినకుండా కవిత పిటిషన్ పై విచారణ చేయవద్దని, కవిత పిటీషన్ పై కీలక ఆదేశాలు జారీ చెయ్యవద్దని కేవియేట్ దాఖలు చేశారు.
కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఈడీ అధికారులు తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని, మహిళలను ఇంటివద్దనే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎటువంటి అరెస్టు వంటి చర్యలను తీసుకోకూడదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 24వ తేదీన కవిత పిటిషన్ పై అసలు విచారణ జరగవలసి ఉండగా, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజుకు విచారణ వాయిదా వేసింది. కవిత పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో ఐటెం నెంబర్ 36 గా లిస్ట్ అయింది.

ఈ నేపథ్యంలో ఈరోజు ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం కవిత పిటిషన్ పై నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత సౌత్ గ్రూప్లో ఉందని ఈడీ పేర్కొంటూ, ఇప్పటికే మూడుసార్లు కవితను ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కవితను మూడు రోజులపాటు విచారించింది. కవిత ఉపయోగించిన ఫోన్లను కూడా ఇవ్వాలని ఆదేశించటంతో కవిత తన ఫోన్లను సైతం ఈడీ అధికారులకు ఇచ్చారు. అంతేకాదు ఈడీ రాజకీయ దురుద్దేశంతోనే తనను విచారిస్తుందని కవిత ఈడీ అధికారులకు రాసిన లేఖలో ఆరోపించారు. ఇక ఈరోజు ఇరు వర్గాల వాదనలు ఏ విధంగా సాగుతాయి? ఈడి కవిత పిటిషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఢిల్లీ మద్యం కుంభకోణం లో ముందు ముందు ఏం జరగబోతుంది? అన్నది దేశ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications