హృదయ విదారకం: కరెంట్ తీసేస్తే నాన్న ప్రాణం పోతుంది.. కాపాడమని చిన్నారుల వేడుకోలు!
కరోనా మహమ్మారి కాటు వేసిన కుటుంబం ఇది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో కరోనా నింపిన విషాదం, ఆక్సిజన్ కోసం ఓ కుటుంబ పెద్ద అల్లాడేలా చేస్తుంది. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లేకపోతే ఊపిరి తీసుకోలేని తండ్రి పరిస్థితి ఇద్దరు చిన్నారులకు తీరని బాధని మిగులుస్తోంది. ఈ కష్టాలు పగవాడికి కూడా రావద్దు భగవంతుడా అని ప్రతిఒక్కరూ అనుకునేలా చేస్తుంది. ఇంతకీ కరోనా కాటుకు విలవిలలాడుతున్న ఆ కుటుంబ పరిస్థితి ఏమిటంటే
కరోనా కారణంగా మంచాన పడిన తండ్రి
హన్మకొండలోని దర్గా కాజీపేటకు చెందిన తీగల సాంబమూర్తి ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడు. భార్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవించేవాడు. 2021లో ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఉన్నదంతా ఖర్చుచేసి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కరోనా వైరస్ ఆయన ఊపిరితిత్తులపైన తీవ్ర ప్రభావం చూపించడంతో సాంబమూర్తి కి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది.

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ పైన ఆధారపడిన తండ్రి
దీంతో వైద్యులు జీవితాంతం ఆయన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ పైన ఆధారపడి జీవించాలని చెప్పారు. దీంతో సాంబమూర్తి గత నాలుగు సంవత్సరాలుగా మంచానికి పరిమితమై జీవన పోరాటం చేస్తున్నాడు. సాంబమూర్తి భార్య కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో రోజువారి కూలీగా పని చేస్తోంది. ఆమెకు వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించడంతో పాటు, సాంబమూర్తి వైద్య ఖర్చులను కూడా చూసుకోవాల్సి వస్తుంది.
కరెంటు తీసేస్తే పని చెయ్యని ఆక్సిజన్ కాన్సెంట్రేటర్
ఈ క్రమంలో ఆమె చాలాకాలంగా కరెంటు బిల్లు కట్టడం లేదు దాదాపు రెండేళ్లుగా కరెంట్ బిల్లు కట్టకపోవడంతో ఇంతకాలం ఊరుకున్న విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లు కట్టకపోతే కనెక్షన్ తొలగిస్తాం అంటూ హెచ్చరించారు. ఒకవేళ కరెంటు తీసేస్తే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ పనిచేయదు. అదేగనుక జరిగితే సాంబమూర్తి ప్రాణం పోతుంది. ఇక ఇదే విషయాన్ని చెప్పిన చిన్నారులు కరెంటు తీసేస్తే మా నాన్న ఊపిరి ఆగిపోతుంది అంటూ కంటతడి పెడుతున్నారు.
రెండేళ్ళ కరెంట్ బిల్.. సాయం కోసం వేడుకోలు
దాదాపు ఇప్పటివరకు 80,000వరకు కరెంట్ బిల్లు బకాయి ఉందని, ఆ బకాయిలు చెల్లించడానికి తమకు సహాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకుంటున్న వారు 7396174727 నెంబర్ కు సంప్రదించాలని వారు కోరుతున్నారు. తండ్రి కోసం ఆ చిన్నారులు పడుతున్న బాధ చూపరులకు కంటతడి తెప్పిస్తుంది. అత్యంత దుర్భరమైన పరిస్థితులలో మంచానికే పరిమితమైన కుటుంబ ఆవేదనను అర్థం చేసుకొని దాతలు స్పందించాలని స్థానికులు సైతం కోరుతున్నారు.












Click it and Unblock the Notifications