హైదరాబాద్‌లో భారీ వర్షం, ఈదురుగాలులు
హైదరాబాద్ నగరం చల్లబడింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘావృతమై నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.
మేడ్చల్, గగిల్లాపూర్ తదితర ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కాగా, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 48 గంటలపాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది.

హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లోనూ ఈదురుగాలులు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎండల నుంచి ప్రజలకు ఈ అకాల వర్షాలతో ఉపశమనం లభించినప్పటికీ.. రైతులకు మాత్రం తీరని పంట నష్టాన్ని మిగిల్చుతున్నాయి. వరితోపాటు మామిడి, ఇతర పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
మూడు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
గురువారం హైదరాబాద్ తోపాటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలతో కూడిన వడగళ్ల వర్షం కురుస్తుందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
శుక్రవారంనాడు సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications