పొంచివున్న వరద ముప్పు: భయాందోళనల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు
ఖమ్మం: తెలంగాణలో మరోసారి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతోపాటు గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. తాలిపేరు జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 7.3 లక్షల క్యూసెక్కులు కాగా, అధికారులు ఇప్పటికే 25 గేట్లను ఎత్తి 1.99 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి వదిలారు.
కాగా, భారీ వరదతో చింతవాగు, రోటెంత వాగులతోపాటు తాలిపేరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. తాలిపేరుకు అనుసంధానంగా ఉన్న చింతవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టులో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మరోవైపు, తాలిపేరు నుంచి భారీగా వరద వస్తుండటంతో దిగువ లోతట్టు దోసెలపల్లి మీదుగా ప్రాజెక్టు వరకు ఉన్న రహదారి మీదకు నీరు పొటెత్తింది. దిగువనున్న పగిడి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు మళ్లీ వరదలో మునుగుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల వచ్చిన వరదలకే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు మరోసారి వరదలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. తాలిపేరుకు వరద నీరు పోటెత్తుతుండటంతో దిగువ గ్రామాలైన జీదండుపేట, కేశవాపురం, గొంపనగూడెం గ్రామాలు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే మరోసారి గోదావరి కూడా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులు, సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను వరద ప్రాంతాల నుంచి తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications