ఎటు చూసినా వరదే: కాలు కదపలేనంత కష్టం: రేవంత్ రివ్యూ
తెలంగాణలో భారీ వర్షాలు తెరిపినివ్వట్లేదు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలపై దీని తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. రాత్రి నుంచి కురిస్తోన్న వర్షాల ధాటికి లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, సొనాల, నేరడిగొండ, బోథ్ లల్లో వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. కల్వర్టులు దెబ్బతిన్నాయి. వరదనీరు రోడ్లపై పోటెత్తింది. పలు గ్రామాల్లో వరద నీరు ఇళ్ళల్లోకి ప్రవేశించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో మోకాలివరకు వరద నీళ్లు పారుతున్నాయి.

అడుగు బయటపెట్టాలంటే దడ పుట్టే పరిస్థితి నెలకొందక్కడ. దుకాణాలు తెరచుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, విద్యాసంస్థలు మూత పడ్డాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల మధ్య.. మళ్లీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. మరో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రంగంలోకి దిగారు.
వాతావరణ శాఖ అందంచిన సమాచారం మేరకు, 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ బృందాలను ముందుగానే మొహరించారని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అందుబాటులో ఉండాలని అన్నారు.
- వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంటూ, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలి.
- నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
- పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలి.
- రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలి. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలి.
- వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలి.
- వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.
- ప్రాణ-ఆస్తి నష్టం, మూగజీవాలకు నష్టం చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.
- హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలి.












Click it and Unblock the Notifications