తెలంగాణలో దంచికొడుతున్న వానలు-మరో 3 రోజులు-భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎల్లంపల్లి,కడెం,జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్నిచోట్ల బలమైన గాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రాష్ట్రంలో 2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదవగా 41 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 247 చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురవగా 381 చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. సోమ,మంగళ,బుధ(జులై 12,13,14) వారాల్లోనూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవాళ,రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన వాతావరణ శాఖ... ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం,తూర్పు-పశ్చిమ ప్రాంతాల మధ్య ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.

ఆదివారం(జులై 11) వరంగల్ రూరల్ జిల్లాలోని చెన్నరావు పేటలో 14సెం.మీ వర్షపాతం,రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 12సెం.మీ,నేరెళ్లలో 11సెం.మీ,కాజీపేటలో 11సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వరంగల్ జిల్లాలో 30 కాలనీలు నీట మునిగాయి. నర్సంపేట-గూడూరు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు పట్టణాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో లక్ష్మీపూర్ సండ్రవాగు ఉధృతికి రహదారి కొట్టుకుపోయింది.
Recommended Video
సూర్యాపేట,నిజామాబాద్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.వర్షపు నీరు భారీగా చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications