నేను మొదటిసారి చేశా, తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా చేశారు: హీరో శ్రీకాంత్
హైదరాబాద్: తాను తన జీవితంలో మొదటిసారి పుష్కర స్నానం చేస్తున్నానని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు బాగున్నాయని ప్రముఖ తెలుగు నటుడు శ్రీకాంత్ ఆదివారం నాడు అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్కర స్నానం చేయడం తన జీవితంలో ఇది మొదటిసారి అన్నారు. హైదరాబాద్ నుంచి పుష్కర ఘాట్ వచ్చే వరకు ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిందన్నారు. చాలా బాగా ఏర్పాట్లు చేశారని కితాబిచ్చారు.

రంగాపురం ఘాట్ వద్ద సౌకర్యాలు, అధికారులు, వాలంటీర్ల సేవలు చాలా బాగున్నాయని చెప్పారు. ఇంత భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి అభినందనలు అని కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
కాగా, కృష్ణా పుష్కరాలకు మూడో రోజైన ఆదివారం క్యూ గట్టారు. ఉదయం ఐదు గంటల నుంచే పుష్కర ఘాట్లకు జనం తాకిడి మొదలైంది. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్లు ఆదివారం జనంతో కిటకిలాడాయి. ముఖ్యం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్న ఘాట్లల్లో జనం రద్దీ ఎక్కువగా కనిపింది.
పాలమూరు జిల్లాలోని బీచుపల్లి, సోమశిల, నల్గొండ జిల్లాలోని మట్టపల్లి, నాగార్జున సాగర్, వాడపల్లి ఘాట్లకు జనం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుష్కర ఘాట్లలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కర ఘాట్లకు చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా, మూసీ నదుల సంగమంగా వాడపల్లి విరాజిల్లుతోంది. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications