దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‍కు, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ టికెట్ పై ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దానం నాగేందర్.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దానంను అనర్హుడిగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దానం కాంగ్రెస్ పార్టీలో చేరారని.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ స్పీకర్‌ను కోరారు.

అయితే, తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దానంపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. దానం నాగేందర్ ను సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందని, ఆయన పార్టీ ఫిరాయించారనడానికి ఇదే సాక్ష్యమని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. దానం నాగేందర్ సహా అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది కోర్టు.












Click it and Unblock the Notifications