గణేశ్ విగ్రహాల ఎత్తు 15ఫీట్లకు మించొద్దు: నివేదిక కోరిన హైకోర్టు
హైదరాబాద్: నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించే గణేశ్ ఉత్సవాలపై హైకోర్టు సోమవారం మరోసారి స్పందించింది. హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం చేయరాదన్న వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఉత్సవాల ఏర్పాట్లపై ఎలాంటి చర్యలు చేపట్టారో తమకు తెలపాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది.
విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీకి సూచించింది. గణేష్ ఉత్సవ సమితి విగ్రహాల ఎత్తు విషయంలో హైకోర్టు సూచనలను వ్యతిరేకించిన నేపథ్యంలో హైకోర్టు మరోసారి ఘాటుగా సూచనలు చేసింది.

కాలుష్యం, విగ్రహాల తయారీకి వాడే రంగు లాంటి పలు అంశాలపై గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు మరోసారి గుర్తు చేసింది. తామిచ్చిన సూచనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో మాదిరిగా తాత్కాలిక డస్ట్ బిన్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చెరువుల ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడి వాటికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిసెంబర్ 31లోగా చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని సూచించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తమను సంప్రందించాలని హైకోర్టు సూచించింది.












Click it and Unblock the Notifications