కెసిఆర్‌కు హైకోర్టు ఝలక్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కుదింపుపై స్టే
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు గురువారం విచారించింది. జిహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు కుదిస్తూ జారీ చేసిన జీవో పైన స్టే విధించింది.
శనివారం లోగా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఎంత సమయం కావాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 31 రోజులు కావాలని ఈసీ చెప్పింది.
రిజర్వేషన్లు ఖరారైన 31 రోజుల్లో తాము ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో, ఎన్నికల గడువు ఫిబ్రవరి 9వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది.

ప్రభుత్వానికి ఎన్నికల కుదింపు అధికారం ఉందా లేదా చూడాలని, ప్రస్తుతానికి జీవోను నిలిపివేయాలని ఆదేశించింది. చట్ట సవరణ అంశంపై సంక్రాంతి తర్వాత విచారణ చేపడతామని చెప్పింది.
అంతకుముందు ఉదయం విచారణ సందర్భంగా... గ్రేటర్ ఎన్నికల షెడ్యూలు కుదింపు చట్ట విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ... పునర్విభజన చట్టం ప్రకారమే సవరణలు చేశామని చెప్పారు.
షెడ్యూల్ కుదింపు సరైంది కాదేమోనని హైకోర్టు అభిప్రాయపడింది. మేము పెట్టిన గడువులోగా (జనవరి 31) ఎన్నికలు నిర్వహించాలని షెడ్యూల్ కుదించారా అని హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైతే మరో వారం, పది రోజుల గడువు పెంచుతామని కోర్టు తెలిపింది.
ప్రభుత్వాన్ని అడిగి చెప్పాలని హైకోర్టు ఏజీని ఆదేశించింది. విచారణను మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసింది. డివిజన్ల రిజర్వేషన్లు ఇవాళ ఖరారు చేస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. మధ్యాహ్నం 2:15 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయోద్దని కోర్టు ఆదేశించింది. అనంతరం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications