Maloth Kavitha : టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు బిగ్ రిలీఫ్... ఆ తీర్పును నిలిపివేసిన హైకోర్టు
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. ఎంపీకి జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిదుల కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలు రుజువు కావడంతో ప్రజాప్రతినిధుల కోర్టు ఆమెకు ఆర్నెళ్ల జైలు శిక్ష,రూ.10వేలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
డబ్బు పంపిణీ ఆరోపణలపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో మాలోత్ కవితపై కేసు నమోదైంది. అప్పటినుంచి దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఎంపీకి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును ఎంపీ కవిత హైకోర్టులో సవాల్ చేయడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది. దీంతో ఎంపీకి బిగ్ రిలీఫ్ లభించినట్లయింది.

ప్రస్తుతం మాలోతు కవిత మహబూబాబాద్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై ఆమె గెలుపొందారు. అంతకుముందు,2009లో కాంగ్రెస్ టికెట్‌పై ఆమె మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి రెడ్యా నాయక్ టీఆర్ఎస్‌లో చేరడంతో ఆమె కూడా అదే బాటలో పయనించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీలో ఎంపీ మాలోతు కవిత పీఏల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి రూ.5లక్షలు గుంజేందుకు ఆ ముగ్గురు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.దీనిపై స్పందించిన ఎంపీ కవిత ఢిల్లీలో తనకు పీఏలు ఎవరూ లేరని వివరణ ఇచ్చారు. సీబీఐ అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఒకరైన దుర్గేష్ తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. మిగిలిన వాళ్లెవరో తనకు తెలియదని అన్నారు.
రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు కూడా ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.తెలంగాణ ఉద్యమ సమయంలో రైలురోకోలో పాల్గొన్న కేసులో వినయ్ భాస్కర్‌పై అభియోగాలు రుజువుకావడంతో ఆయనకు శిక్ష పడింది.వినయ్ భాస్కర్‌తో పాటు 18 మందికి కోర్టు జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించింది. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవలే టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కూడా కోర్టు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తిపై దాడిచేసి గాయపరిచారన్న కేసులో 2013లో నాగేందర్‌పై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో నాగేందర్‌ను దోషిగా తేల్చిన హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు ఆయనకు రూ.1వెయ్యి జరిమానాతో పాటు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది. అప్పటివరకూ శిక్ష అమలును నిలిపివేసింది.












Click it and Unblock the Notifications