ఆ గ్రామ పంచాయతీ ఎన్నిక నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉతర్వులు.. కారణమిదే
తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఎన్నికల నియమావళి కూడా అమలులోకి వచ్చింది. గురువారం నాడు నామినేషన్ల పర్వం మొదలు కాగా తొలి రోజు 563 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ పదవులకు 3242 నామినేషన్లు, వార్డు పదవులకు 1821 నామినేషన్లు దాఖలు చేయబడ్డాయి.
తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అయితే ఇదే సమయంలో ఎన్నికలు జరగాల్సి ఉన్న ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మహమూద్ పట్నం సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు కేటాయించడాన్ని మిట్టగడువుల యాకూబ్ అనే వ్యక్తి అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిని విచారణ జరిపిన జస్టిస్ టి మాధవి దేవి ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

నామినేషన్ల తొలిరోజే ఆ పంచాయతీ ఎన్నిక నిలిపివేత
నామినేషన్ పర్వం మొదలైన తొలి రోజే వరంగల్ జిల్లాలోని మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికలను హైకోర్టు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మహమూద్ పట్నంలో సర్పంచ్ పదవిని, మూడు వార్డు సభ్యులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అయితే ఆ గ్రామంలో ఎస్టీలు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు.
అప్పటివరకు ఆ పంచాయతీ ఎన్నిక లేనట్టే
వారికి సర్పంచ్ పదవితోపాటు, వార్డు సభ్యులను కూడా కేటాయించడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విచారించిన కోర్టు ఈ కేటాయింపులను తప్పు పట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2025 ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్ సరికాదని కోర్టు అభిప్రాయపడింది. దీనిపైన దాఖలైన పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే వరకు మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
వినతి పత్రాలు ఇచ్చినా సరే తప్పు రిజర్వేషన్స్
పిటిషనర్ తరపున న్యాయవాది 2025 ఓటర్ల జాబితా ప్రకారం మహమూద్ పట్నంలో 576 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో కేవలం ఆరుగురు మాత్రమే ఎస్టీలు ఉన్నారని తెలిపారు. ఇంత తక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గానికి సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులు కేటాయించడం అన్యాయమని దీనిపైన వినతి పత్రాలు కూడా సమర్పించారని అయినా చర్యలు తీసుకోలేదని కోర్టుకు వివరించారు.
వినతి పత్రాలపై చర్యలు తీసుకునే వరకు ఎన్నిక నిలిపివేత
ఈ వాదనలు విన్న కోర్టు వినతి పత్రాల పైన చర్యలు తీసుకునే వరకు మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపైన తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications