తెలంగాణాలో భానుడి ప్రతాపం.. వారంరోజుల్లో భగభగలే!
తెలుగు రాష్ట్రాలలో ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి చివరివారం నుండి ఎండలు ప్రారంభమయ్యాయి .ప్రస్తుతం మార్చి నెల మొదటి వారంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి.
ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
ఇప్పుడు 11 దాటితే రోడ్డుమీదకు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుండి ఎండలు మండుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటుగా, వేడి గాలులు కూడా వీస్తున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే రానున్న ఐదు రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రానున్న ఐదు రోజుల్లో సగటు ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుండి 40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో ఎండలు దంచికొట్టాయి. నిన్న అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాల లో 39.8 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ వారం ఎండల తీవ్రత పెరుగుతుందని అంచనా
మరోవైపు హనుమకొండ, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి, మహబూబాబాద్ జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రత 39.7° గా నమోదైనట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని 37° ఉష్ణోగ్రత నమోదైనట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో ముందు ముందు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఎండలలో జాగ్రత్త
ముఖ్యంగా ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఎండాకాలంలో డిహైడ్రేషన్ కు గురికాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తాగాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications