సీబీఐ, ఈడీ, ఐటీలతో దర్యాప్తు చేయించే దమ్ ఉందా?: కేటీఆర్ సవాల్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలపై వెలువడిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ దుమారం రేపుతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా అదానిపై ఈడీ, సీబీఐ, ఐటీ, సెబిలతో దాడులు చేయించ గల దమ్ము కేంద్రానికి ఉందా?
హైదరాబాద్: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ తాజాగా ఇచ్చిన నివేదిక దుమారం రేపుతోంది. రాజకీయ రంగును కూడా పులుముకుంటోంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం- గౌతమ్ అదాని నివాసంపై గానీ, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలపై గానీ దర్యాప్తు చేయించగలదా? అనే ప్రశ్నలు తలెత్తుతోన్నాయి. వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోన్నాయి.

హిండెన్ బర్గ్ రిపోర్ట్..
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల యాజమాన్యం సుదీర్ఘకాలంగా స్టాక్ మానిప్యులేషన్ పాల్పడుతోందంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అకౌంటింగ్ మోసాలు చేస్తోందని వివరించారు. దీనికి సంబంధించిన వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. తన నివేదిక కోసం అదానీ గ్రూప్ కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ హోదాల్లో పని చేసిన ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. కీలక డాక్యుమెంట్లను పరిశీలించింది.

హై వాల్యుయేషన్..
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల వాస్తవ గణాంకాల కంటే అత్యధికంగా దాన్ని వాల్యుయేషన్ చేయగలిగిందని, ఫలితంగా స్టాక్ మార్కెట్లల్లో షేర్ల విలువను అధికంగా కోట్ చేసిందని తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మారిషస్, కొన్ని కరేబియన్ దేశాల్లో అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను ఆధారంగా చేసుకుని పలు డమ్మీ కంపెనీలు నెలకొల్పడానికి అదానీ కుటుంబం సహకరించినట్లు నిర్ధారించింది.
ఎగ్జిమ్ కు విరుద్ధంగా..
ఎగ్జిమ్ పాలసీకి విరుద్ధంగా ఎగుమతులు/దిగుమతులు, వార్షిక టర్నోవర్ లను తప్పుగా చూపించిందని పేర్కొంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు దారి మళ్లించినట్లూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో పొందుపరిచింది. ఇది కాస్తా దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కార్పొరేట్ సెగ్మెంట్ లో కలకలానికి దారి తీసింది. అటు రాజకీయరంగును కూడా పులముకుంటోందీ వ్యవహారం. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు దీనిపై కేంద్రాన్ని నిలదీస్తోన్నారు.

కేటీఆర్ సవాల్..
తాజాగా- భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీనిపై కథనాలు రాయదని స్పష్టం చేశారు. కీలకమైన ఈ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ పై ఎలాంటి టీవీ డిబేట్స్ ఉండబోవని, చివరికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై కూడా ఈ విషయం ప్రస్తావనకు రాదని అన్నారు. పైగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ నివేదికను తొలగించే పనిలో ఎన్పీఏ ప్రభుత్వం నిమగ్నమై ఉంటుందని చెప్పారు.

హై దమ్ ప్రోబ్ కర్నే కా
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని- కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపు పన్ను లేదా సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో దర్యాప్తు చేయించగలదా? అని ప్రశ్నించారు. అదాని గ్రూప్ కంపెనీలపై దర్యాప్తు చేసే దమ్ము ఉందా? అంటూ సవాల్ విసిరారు. హై దమ్ ప్రోబ్ కర్నే కా అని నిలదీశారు. హిండెన్‌బర్గ్ ట్వీట్ ను ఆయన రీట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications