క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
హిందూ ఆచారాలను, సంప్రదాయాలను తక్కువ చేసి చూస్తున్నారనే కారణంతో కొందరు హిందువులు ఓ క్రైస్తవ పాఠశాలపై దాడి చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హిందూ విద్యార్థులు తమ మతపరమైన దుస్తులు ధరించడానికి పాఠశాల యాజమాన్యాన్ని అనుమతించడం లేదని హిందువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు, మతపరమైన దుస్తులు ధరించిన విద్యార్థులపై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంతలో, హిందూ విద్యార్థులను మతపరమైన దుస్తులు ధరించడానికి ప్రిన్సిపాల్ నిరాకరించారని ఆరోపిస్తూ ఒక విద్యార్థి వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.దీంతో వివాదం పెద్దదిగా మారింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు భగ్గమన్నాయి. జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ హిందూ సంఘాలు ఏప్రిల్ 16న తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో క్యాథలిక్ పాఠశాలను ధ్వంసం చేశారు.

కన్నెపల్లి గ్రామంలోని సెయింట్ మదర్ థెరిస్సా ఇంగ్లీషు మీడియం స్కూల్‌ను ధ్వంసం చేసి, అద్దాలు, పూల కుండీలు పగలగొట్టి, ప్రధాన ద్వారాల వద్ద ఉన్న సెయింట్ మదర్ థెరిసా విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. స్కూల్ మేనేజర్ ఫాదర్ జైమన్ జోసెఫ్‌పై కూడా హిందువులు దాడి చేశారు. స్కూల్ యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు పాఠశాల యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications