ఒళ్ళు పులకింపజేసిన అయోధ్య అద్భుత ఘట్టం: తెలంగాణాలో ఉప్పొంగిన భక్తి ప్రవాహం!!
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు అధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రముఖ దేవాలయాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. ఊరూరా, రామాలయాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు చేస్తున్నారు. నగరాలలో నివాస సముదాయాలలో ప్రత్యేకంగా, సామూహిక భక్తి కార్యక్రమాలు ఏర్పాటుచేసి పండుగ చేసుకుంటున్నారు.
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రత్యేకంగా సీతా రాముల పూజలు నిర్వహించి, రామనామ సంకీర్తన నిర్వహించారు. నిజాం కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అయోధ్య రామలయంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటుగా,జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాలలో వేకువజామునుంచే పూజలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పండుగ వాతావరణ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అన్ని గ్రామాల్లో ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక నిర్వహిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలు, హనుమాన్ ఆలయాల వద్ద పూజలు నిర్వహించేందుకు ప్రజలు బారులు తీరారు. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో ని రామాలయం , ఇతర ప్రాంతాలలో శ్రీరాముని విగ్రహాలు, పాదుకలతో శోభా యాత్ర నిర్వహించారు.

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామాలయాల వద్ద ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేసి బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. శివనగర్ లోని రామాలయం వద్ద భజనలు, సంకీర్తనలతో విశేషమైన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రధాన కూడళ్ళ వద్ద ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరూ సామూహికంగా ప్రసాదవితరణ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ ఇలా ప్రతి జిల్లాలోనూ అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలంతా ఈ తెల్లవారు జాము నుంచే ఆలయాల్లో శ్రీరామ కీర్తనలు పాడుతూ పూజలు నిర్వహించారు. ఇంటింటికీ పంపించిన అక్షింతలను ఆశీర్వచనంగా తీసుకొని ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించి పండగ నిర్వహించుకున్నారు.












Click it and Unblock the Notifications