ఎమ్మెల్యే అభ్యర్దుల్లో కొత్త టెన్షన్ - అక్కడ ఫలితం తారుమారు..!?
తెలంగాణ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ నెల 30న తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఓటర్లను ఆకట్టుకొనేందుకు పార్టీలు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. తుది దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఇదే సమయంలో అభ్యర్దులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఈ నెల 30న పోలింగ్ రోజు ఓటింగ్ కోసం సెలవు ప్రకటించారు. తరువాత వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి.
వరుస సెలవులతో : తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరా హీరీగా తలపడుతున్నాయి. ప్రతీ సీటు..ప్రతీ ఓటు నిర్ణయాత్మకంగా మారుతోంది. ఇదే సమయంలో గ్రేటర్ తో పాటుగా అన్ని జిల్లాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. అభ్యర్దులు సైతం తమకు మద్దతుగా నిలిచే ప్రతీ ఓటు పోల్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో కొత్త సమస్య అభ్యర్దులను వెంటాడుతోంది. పోలింగ్ జరిగే 30వ తేదీ సెలవు ప్రకటించారు. ఆ తరువాత శుక్రవారం మినహాయిస్తే శనివారం హైదరాబాద్ పరిధిలోని ఐటీ, ప్రముఖ ప్రయివేటు సంస్థలకు చాలా వరకు సెలవు ఉంటుంది. అందునా కార్తీక మాసం కావటంతో.. వరుస సెలవులతో ఓటర్లు పోలింగ్ నాడు ఓటింగ్ కేంద్రాలకు వస్తారా.. టూర్లకు ప్లాన్ చేస్తారా అనే టెన్షన్ అభ్యర్దుల్లో మొదలైంది.

పోలింగ్ పై ప్రభావం : ప్రధానంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ లో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో కొందరికి ఇక్కడ ఓటు హక్కు లేదు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇందులో ఉండటంతో వారి సొంత ప్రాంతాల్లోనూ ఇప్పటికీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణకు చెందిన వారు ఓటు హక్కు కోసం వారి సొంత గ్రామాలకు వెళ్లిపోతారు. హైదరాబాద్ లో వీరిలో 30-40 శాతం మంది ఓటు వేస్తారని అంచనా. ప్రధానంగా హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుంది. వీరితో పాటుగా కుటుంబ సభ్యులను వీరు ప్రభావితం చేస్తారు. గతంలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీరి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. ఈ సారి కూడా వీరు ఓటింగ్ డే..తరువాతి సెలవుల కారణంగా పోలింగ్ కు దూరంగా ఉంటే ఏం జరుగుతుందనే అంచనాలు మొదలయ్యాయి.

ఫలితం లో కీలకం : కార్తీక మాసం కావటంలో వన భోజనాలు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వరుస సెలవులతో ఇలాంటి టూర్లు ప్లాన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో..ఉద్యోగుల ఓట్ల పైన మూడు ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. గ్రేటర్ తో పాటుగా పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీనే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో తమకు అనుకూలంగా ఉన్న ప్రతీ ఓటు పోల్ అయ్యేలా అభ్యర్దులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, ఇప్పుడు ఈ సెలవుల కారణంగా..పోలింగ్ శాతం తగ్గితే ఎవరి గెలుపు పైన ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications