మేడ్చల్ లో దారుణం.. ఇద్దరు కుమారులను నరికి చంపి.. ఆపై తల్లి ఆత్మహత్య
ఏం కష్టమొచ్చిందో ఆ తల్లికి.. కన్నపిల్లలనే కడతేర్చింది. క్షణికావేశంతో ఇద్దరు చిన్నారులను నరికి చంపింది. అంతేకాక భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో జరిగింది. జీడిమెట్లలో నివసిస్తున్న ఆ మహిళ.. 7 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపింది. అనంతరం ఐదంతస్తుల భవనం మీద నుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
మేడ్చల్ జిల్లా గాజులరామారం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన కన్న తల్లే ఆ పిల్లల పాలిట యమపాశం అయింది. కళ్ల ముందే తిరుగుతూ ఉన్న ఇద్దరు చిన్నారులను కర్కషంగా నరికి చంపింది. అంతేకాక బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఇద్దరు పిల్లల్ని హతమార్చింది ఆ తల్లి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థానికుల కథనం ప్రకారం.. తేజస్విని రెడ్డి అనే మహిళ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలోని బాలాజీ లేఅవుట్లో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమె భర్త పేరు వెంకటేశ్వర్ రెడ్డి. ఈ దంపతులకు అర్షిత్ రెడ్డి (6), ఆశిష్ రెడ్డి (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరు పిల్లల్ని తల్లి కొబ్బరి బోండాలు నరికే కత్తితో నరికి చంపింది. అనంతరం బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో 5 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ లో అనారోగ్య కారణాల వలన ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఉందని సమాచారం. దంపతులిద్దరికీ గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి స్వగ్రామం ఖమ్మం జిల్లా సత్తుపల్లి అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనారోగ్యం, కుటుంబ కలహాలేనా ఇంకా ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications