హాట్ డిబేట్: ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పవర్ వార్!!
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని వార్తలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే, బిజెపి లో చోటుచేసుకున్న సంక్షోభం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు బండి సంజయ్ నేతృత్వంలోనే వెళతామని బిజెపి తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్ అనేకమార్లు చెప్పినప్పటికీ, ప్రస్తుతం పరిణామాలు అందుకు భిన్నంగా తయారయ్యాయి. తెలంగాణలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు, బండి సంజయ్ ఒంటెత్తు పోకడలను వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకుల వ్యాఖ్యలదుమారం, బీజేపీ నుంచి ఇతర పార్టీలలోకి నేతలు జంప్ అవుతారని జరుగుతున్న ప్రచారం వెరసి తెలంగాణ బీజేపీనేతల పంచాయతీ ఢిల్లీకి చేరింది.

ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ బీజేపీ లో పదవుల పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. అధ్యక్షుడి మార్పు తథ్యమని ప్రకటనలు వస్తున్న సమయంలో, బండి సంజయ్ మోడీ పర్యటన వరకు తాను అధ్యక్షుడిగా ఉండొచ్చు.. లేకపోవచ్చు అని వ్యాఖ్యలు చేయటం కూడా అందుకు కారణం అయ్యింది. ప్రస్తుతం కమలం నేతలు ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే బండి సంజయ్ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ కాగా, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో అధ్యక్షుడు మార్పు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దానిపై పార్టీ శ్రేణుల్లో తర్జనభర్జన జరుగుతోంది. తెలంగాణ బీజేపీ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని అంచనాలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డికి అవకాశం ఇస్తారని ప్రస్తుతం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

తెలంగాణ బిజెపి ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ కు బాధ్యతలు అప్పగిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. బండి సంజయ్ కు కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం ఇస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఏది ఏమైనా ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే బిజెపిలో చోటుచేసుకున్న ఈ పరిణామం, తెలంగాణ బిజెపికి ఎన్నికలలో నష్టం చేస్తుందేమో అన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications