మాదాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం: 150గుడిసెల దగ్ధం, బోరుమన్న కూలీలు
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ సమీపంలోని పత్రికా నగర్లో ఖాళీ ప్రదేశంలో పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. గురువారం ఉదయం చెలరేగిన మంటల కారణంగా దాదాపు 150 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయి.

అందరూ కూలిపనికి వెళ్లిన సమయంలో ప్రమాదం సంభవించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడే గుడిసెలు వేసుకొని కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న బాధితులు అక్కడికి చేరుకుని కాలి పోయిన తమ గుడిసెలు చూసి బోరున విలపించారు. తమకు నిలువ నీడ కూడా లేకుండా పోయిందని, ఇంతకాలం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు కాలిబూడిదైందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు.












Click it and Unblock the Notifications