హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో నేడూ భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్
శుక్రవారం కూడా హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్: నగరంలో గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, శుక్రవారం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రాజేంద్రనగర్‌లో అత్యధిక వర్షపాతం నమోదు
గురువారం కురిసిన వర్షంతో వాతావరణ ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. దీంతో గత కొద్ది రోజులుగా ఎండవేడిమితో సతమతమవుతున్న హైదరాబాద్ నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. అత్యధిక వర్షపాతం రాజేంద్రనగర్‌లో (49 మి.మీ), తర్వాత శేరిలింగంపల్లి (34.8 మి.మీ) నమోదైంది. బండ్లగూడ (31.5 మి.మీ), ఉప్పల్ (31.3 మి.మీ), బహదూర్‌పురా (30.8 మి.మీ), నాంపల్లి (27 మి.మీ), ఆసిఫ్‌నగర్ (21.5 మి.మీ), ముషీరాబాద్ (21.5 మి.మీ), సికింద్రాబాద్ (21.3 మి.మీ), చార్మినార్ (21 మి.మీ) తోపాటు తదితర ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు కురిశాయి. దీంతో మంచు పరిచినట్లుగా పలు ప్రాంతాలు మారిపోయాయి.
నేడు కూడా హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం
మార్చి 19 వరకు భారత వాతవరణ శాఖ హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్లు.. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో మార్చి 17న మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములుమెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మార్చి 18, 19 తేదీల్లో కూడా ఇదే వాతావరణం ఉండనుందని పేర్కొంది.
హైదరాబాద్ సర్కిల్‌లో పడిపోనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సీయస్ కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని అన్ని సర్కిళ్లలోనూ గరిష్ణ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications