Viral Video: డబ్బు కంటే మనుషుల ప్రాణాలే ముఖ్యం: పంక్చర్ షాపు యజమాని ఉదారత!
Viral Video: మానవత్వానికి అద్ధం పడుతోన్న ఘటన జయంశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలంలో చోటుచేసుకుంది. దారి మధ్యలో వాహనం టైర్ పంక్చరయ్యి ఇబ్బంది పడుతున్న ఇద్దరు బొగ్గు గని కార్మికులకు ఓ స్థానిక పంక్చర్ షాపు యజమాని సమయానికి వచ్చి సాయం అందించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే కాకుండా.. వారి వద్ద సరిపడా డబ్బులు లేకపోయినా రూపాయి కూడా ముందస్తుగా తీసుకోకుండా సేవలు అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
మొబైల్ పంక్చర్ రిపేర్ సేవలందిస్తున్న సయ్యద్ రహీమ్ పాషా అనే వ్యక్తి.. రాంపూర్ రంగా రమేష్, నీలాల ప్రసాద్ అనే ఇద్దరు సింగరేణి గని కార్మికులకు ఈ రకంగా ఆదుకున్నారు. అడవి మార్గంలో లేదా గనులు సమీపంలో వాహనాలు పంక్చర్ అయి నిలిచిపోతే.. రెండు, మూడు లేదా నాలుగు చక్రాల వాహనం ఏదైనా సరే అక్కడికే వచ్చి రిపేర్ చేస్తానని రహీమ్ వెల్లడించారు. నమాజ్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా వీరు పంక్చర్ అయి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని రహీమ్ పాషా వెంటనే అక్కడి చేరుకున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత టైర్ ట్యూబ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు గ్రహించిన రహీమ్ పాషా.. వారి వద్ద కొత్త ట్యూబ్ కొనేందుకు తగినంత డబ్బు లేకపోయినా ఏ మాత్రం వెనుకాడలేదు. తన వద్ధ ఉన్న కొత్త ట్యూబ్ ను అమర్చి.. వారిని సురక్షితంగా ప్రయాణమయ్యేలా చేశారు. గ్రామానికి చేరుకున్న తర్వాత డబ్బులు పంపవచ్చని వారికి ధైర్యం చెప్పారు. ఆ ప్రాంతం గుండా వెళ్లే వారు ఎవరైనా ఆపదలో ఉంటే తనకు ఫోన్ చేయవచ్చని.. డబ్బుల కంటే మానవత్వమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
"మనుషులుగా పుట్టినందుకు ఒకరికొకరు సహాయం చేసుకోవడమే అసలైన మానవత్వం. డబ్బు కంటే మనుషుల ప్రాణాలు, దయ, కరుణలకే నిజమైన విలువ ఉంది" అని రహీమ్ పాషా స్పష్టం చేశారు. స్వార్థం పెరిగిపోతున్న నేటి రోజుల్లో, తోటి వారికి ఉచితంగా సేవలు అందిస్తూ రహీమ్ పాషా చూపిన ఈ ఉదారత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.













Click it and Unblock the Notifications