పెళ్లైన నెల రోజులకే మహిళ టెక్కీ ఆత్మహత్య: భర్త వేధింపులే కారణం
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన నెల రోజులకే ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఎన్నో ఆశలు, ఊసులతో వివాహ జీవితంలో అడుగుపెట్టిన ఆమెకు.. భర్త నుంచి శారీరక, మానసిక వేధింపులు ఎదురయ్యాయి. అదనపు కట్నం తేవాలంటూ కట్టుున్న భర్త నుంచి వేధింపులు తట్టుకోలేక ఆమె తనువు చాలించింది.
పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేటకు చెందిన సుప్రియా రెడ్డి(26)ని అదే జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన మద్దూరు రాఘవేంద్ర రెడ్డికి ఇచ్చి మార్చి 24న వివాహం చేశారు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధి శంషీగూడలో నివాసం ఉంటున్నారు.

వివాహమైన కొద్ది రోజులపాటు రాఘవేంద్ర రెడ్డి.. సుప్రియతో బాగానే ఉన్నాడు. అయితే, ఆ తర్వాత తాను చెప్పినట్టే వినాలని, ఆమె జీతం కూడా తన బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలని, ఇళ్లు కట్టుకునేందుకు పుట్టింటి నుంచి 3 ఎకరాలు రాయించుకుని రావాలని సుప్రియను వేధించడం మొదలుపెట్టాడు. తరచూ ఇదే విషయమై సుప్రియపై ఒత్తిడి చేశాడు.
ఈ నేపథ్యంలోనే అతని వేధింపులు తాళలేక సుప్రియ తన తనువు చాలించింది. గురువారం రాత్రి 11.30 గంటలకు సుప్రియ ఉరి వేసుకున్నట్లు పక్కింటివారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో ఆమె భర్త రాఘవేంద్ర రెడ్డి ఆఫీసుకు వెళ్లాడు.
అయితే, తమ కుమార్తె రాత్రి 8 గంటకు తమతో మాట్లాడిందని సుప్రియ తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉన్నట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎంతో గారాబంగా పెంచిన తమ కుమార్తెను పెళ్లి చేసి పంపిస్తే.. నెల రోజుల్లోనే విగత జీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సుప్రియ మరణంతో ఆమె కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications