నోరుంది కదా అని తప్పుడు ప్రచారాలు చేస్తే ... కేటీఆర్, కేసీఆర్ లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ !!
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధించి హన్మకొండలోని హరిత కాకతీయ లో మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను ప్రలోభపెట్టటం కోసం మద్యం, డబ్బు ఏరులై పారుతుందని ఆరోపించారు.
తెలంగాణా కోసం పోరాడుతున్న వారు బీజేపీకే మద్దతు
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, హుజురాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొన కిషన్ రెడ్డి అందుకే టిఆర్ఎస్ నాయకులు అనేక అబద్ధాలు చెబుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మార్పు కోసం హుజురాబాద్ ప్రజలు బిజెపికి ఓటు వేయనున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ బలగాలు అడిగాం
ఈటల రాజేందర్ ను ఎదుర్కోలేక టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న రాత్రి బిజెపి కార్యకర్తలు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొన్న కిషన్ రెడ్డి, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ తప్పక విజయం సాధిస్తారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ బలగాలు రావాలని తామే కోరామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ను హుజురాబాద్ ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని కోరుతున్నానని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజా సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని టిఆర్ఎస్ నాయకుల బెదిరింపులు
హుజురాబాద్ మహిళలు బిజెపికి తప్పకుండా ఓటేస్తారు అన్నారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయని పక్షంలో ప్రజా సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని టిఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈటల రాజేందర్ కు ఓటు వేయకుండా ఏ రకంగానూ ప్రజలను నిలువరించలేరని తేల్చిచెప్పారు. నోరు ఉంది కదా అని తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు, కెసిఆర్, కేటీఆర్ అహంకారానికి ప్రజల ఓట్లతో చెంప ఛెళ్లుమనిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునేది టీఆర్ఎస్ నే
బిజెపి, కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ నేత అని ఎద్దేవా చేశారు. బిజెపికి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఇంకా ఖరారు కాలేదని చెప్పిన కిషన్ రెడ్డి ఈ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటబోతుంది అంటూ తేల్చి చెప్పారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గిమ్మిక్కులను ప్రజలు నమ్మబోరని ఆయన తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications