Huzurabad Bypoll: ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్: బాంబు పేల్చిన కేటీఆర్
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను పలకరిస్తోన్నారు ఆయా పార్టీల నాయకులు. ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. దీనికితోడు- పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉప ఎన్నిక వాతావరణాన్ని మరింత హీటెక్కిస్తున్నాయి.

30న పోలింగ్..
తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన పోలింగ్ ఉంటుంది. వచ్చే నెల 2వ తేదీన ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. బద్వేలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలపలేదు. ఈ ఎన్నికలో పోటీ చేయట్లేదు. హుజూరాబాద్‌లో పోటీ చేయడాేనికి టీడీపీకి అభ్యర్థే లేడు. అందుకే కాంగ్రెస్‌కు సహకరిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా బీజేపీ పోటీలో ఉంది. అధికార పార్టీలను ఢీ కొడుతోంది.

హుజూరాబాద్ హీట్..
బద్వేలుతో పోల్చుకుంటే- హుజూరాబాద్ ఉప ఎన్నిక తీవ్రత అధికంగా ఉంటోంది. అక్కడ ముక్కోణపు పోటీ ఏర్పడింది. కొద్దిరోజుల వరకూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడం, కాంగ్రెస్ కూడా తన సత్తా చాటడానికి సమాయాత్తమౌతోండటం వంటి పరిణామాల నేపథ్యంలో- హుజూరాబాద్‌పైనే అందరి దృష్టీ నిలిచింది. ప్రత్యేకించి- బీజేపీ ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈటలను గెలిపించడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది.

కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కదు..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరుతామనే ధీమా అధికార టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమౌతోంది. తమ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు తథ్యమని, మెజారిటీపైనే దృష్టి సారించామని చెబుతున్నారు గులాబీ నేతలు. ఈ ముక్కోణపు పోరులో కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. దమ్ముంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకోవాలంటూ ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు..
టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో కేసీఆర్.. తనను కలిసిన విలేకరులతో చిట్‌చాట్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై మాట్లాడారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయిని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ధ్వజమెత్తారు. పరోక్షంగా బీజేపీ విజయానికి కాంగ్రెస్ సహకరిస్తోందని విమర్శించారు. కొద్దిరోజుల తరువాత ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. ఈటలను కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని అన్నారు. దీనిపై తన వద్ద పక్కా సమచారం ఉందని తెలిపారు.

కేసీఆర్ విజనరీ.. వారు టెలివిజనరీలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు.. దేశానికే దిక్సూచిగా మారాయని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని అభివర్ణించారు. ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని, తెలంగాణ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, దానికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు కాగా.. మిగతా పార్టీల నేతలు టెలివిజనరీలనీ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

రేవంత్‌కు చిలక జోస్యం కరెక్ట్..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని, ఆ తరువాత రేవంత్ రెడ్డి చిలకజోస్యం చెప్పుకొంటే మంచిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్క ఒక్కరే చిత్తశుద్ధి గల నాయకుడని ఆయన ప్రశంసించారు. పార్టీలో ఆయన మాటకు విలువ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో గట్టి అక్రమార్కుల హవా నడుస్తోందని అని చెప్పారు. కాంగ్రెస్ ఇక పుంజుకోవడం కలేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

విజయగర్జన కోసం సన్నాహాలు..
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ 10 నామినేషన్లు దాఖలయ్యాయని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ తరఫున మంత్రులు నామినేషన్లను దాఖలు చేశారని చెప్పారు. పార్టీ ద్విదశాబ్ది వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నవంబర్ 15వ తేదీన విజయగర్జన సభను నిర్వహించాల్సి ఉందని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను తరలించడానికి భారీగా ఆర్టీసీ బస్సులు తీసుకుంటామని, ఆ రోజు ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications