దీపావళి తర్వాత భారీగా పెరగనున్న బిర్యానీ ధరలు.. బిర్యానీ లవర్స్ కు షాక్!
హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే హైదరాబాద్ అనే మాట నిజమే. కానీ ఇప్పుడు ఆ ప్రియమైన వంటకం సామాన్యుల జేబుకు భారం కాబోతోంది. దీపావళి తర్వాత నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు బిర్యానీ ధరలు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.
బిర్యానీ తయారీకి కీలకమైన బాస్మతి బియ్యం ధర గతంలో కిలో రూ.95 వరకు ఉండగా, ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకుంది. పౌల్ట్రీ ఫీడ్ ఖర్చులు పెరగడంతో చికెన్ ధర కిలోకు రూ.300 మార్కును దాటింది. యాలకులు, లవంగాలు, ఇతర మసాలా దినుసులు, వంటనూనె ధరలు కూడా ఊహించని రీతిలో పెరిగాయి. దీంతో హోటళ్ల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగిపోయిందని యజమానులు చెబుతున్నారు.

కార్మికుల వేతనాలు, కరెంట్ బిల్లులు, గ్యాస్ సిలిండర్ ఖర్చులతో పాటు ముడి సరుకుల భారాన్ని ఇకపై తాము మాత్రమే భరించలేమని రెస్టారెంట్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం కొనసాగించాలంటే ధరలు సవరించక తప్పదని స్పష్టం చేస్తున్నారు. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, దీపావళి ముగిసిన వెంటనే కొత్త ధరలు అమల్లోకి తీసుకురావాలని రెస్టారెంట్ అసోసియేషన్లు, హోటల్ యజమానులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఒక్కో ప్లేట్ బిర్యానీపై కనీసం రూ.50 నుంచి రూ.100 వరకు పెరగవచ్చు. చిన్న హోటళ్ల నుంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల వరకు అన్ని చోట్లా ఈ పెంపు ప్రభావం కనిపించనుంది. వారాంతాల్లో కుటుంబంతో కలిసి బిర్యానీ తినాలనుకునే వారికి, రోజూ హోటళ్లపై ఆధారపడే బ్యాచిలర్లకు ఈ ధరల పెరుగుదల పెద్ద భారంగా మారనుంది.
హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. నగరంలోని పారడైజ్, షాదాబ్, బావర్చి వంటి ప్రముఖ హోటళ్లు నుంచి సాధారణ స్ట్రీట్ సైడ్ షాపుల వరకు ప్రతి చోటా బిర్యానీకి డిమాండ్ ఎక్కువ. ఇటీవల నిత్యావసరాల ధరలు పెరగడంతో ఇప్పటికే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బిర్యానీ ధరలు కూడా పెరిగితే మరింత ఒత్తిడి పడుతుంది.హోటల్ యజమానులు ధరలు పెంచకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా, ముడి సరుకుల ధరలు ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా సవరణ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications
