విచారణ మరోసారి వాయిదా: శిక్ష నుంచి తప్పించుకున్న విజయ్ మాల్యా!
హైదరాబాద్: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు ఎలాంటి శిక్ష పడుతుందోనని ఆసక్తిగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. కింగ్‌ఫిషర్ చెక్ బౌన్స్ కేసు విచారణను హైదరాబాద్‌లోని కోర్టు మంగళవారం ఆగష్టు 4 వరకు వాయిదా వేసింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసు ఇటీవలే జులై 5కి వాయిదా పడింది.
దీంతో మంగళవారం విచారణ చేపట్టిన ఎర్రమంజిల్ కోర్టు తదుపరి విచారణను మరో నెలరోజుల పాటు వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న జీఎంఆర్ సంస్ధకు కింగ్‌ఫిషర్ విమానాల కోసం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకుగాను మాల్యా రూ.50 లక్షలు విలువ చేసే రెండు చెక్కులను ఇచ్చారు.
బ్యాంకు ఖాతాల్లో నగదు లేకపోవడం వల్ల మాల్యా ఇచ్చిన రెండు చెక్‌లు బౌన్స్ అయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్లోని ప్రత్యేక కోర్టులో మాల్యాపై ఫిర్యాదు చేసింది. దీంతో మాల్యాను కోర్టులో హాజరుపర్చాలని కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. అంతేకాదు కేసులో కోర్టు మాల్యాను దోషిగా తేల్చింది.

అయితే శిక్షను ఇంకా ఖరారు చేయలేదు. దోషి లేకుండా శిక్షను ఖరారు చేయలేమన్న న్యాయమూర్తి మాల్యాను తమ ముందు హాజరుపరచాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. కోర్టు సమన్లు జారీ చేసిన చిరునామాతో ఉన్న నివాసాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ సీజ్ చేసింది. మాల్యా అక్కడ ఉండడం లేదని వివరిస్తూ మహారాష్ట్ర పోలీసులు కోర్టుకు నివేదించారు.
దీంతో నాంపల్లి కోర్టు జారీ చేసిన సమన్లను పోలీసులు విజయ్ మాల్యాకు అందించలేకపోయారు. దీంతో మాల్యా నివసిస్తున్న సరైన చిరునామా ఇవ్వాలని న్యాయవాది ఎం కృష్ణారావు ఈ సందర్భంగా జీఎంఆర్‌కు సూచించిన నేపథ్యంలో కేసు విచారణను వాయిదా వేసింది. కాగా జీఎంఆర్ సంస్థకు మొత్తంగా విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై 11 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications