బెంగళూరు, చెన్నైలను దాటేసి డేంజర్ జోన్ లో హైదరాబాద్!
భారతదేశంలో మెట్రో నగరాలలో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతుంది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత డేంజర్ జోన్ లోకి వెళ్ళగా, ఇక ప్రముఖ మెట్రో నగరాలు కూడా ఢిల్లీ బాటలో పడుతున్నాయి. తాజాగా దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నైలను కూడా అధిగమిస్తూ హైదరాబాద్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతోంది.
ప్రమాదంలో హైదరాబాద్
నగరంలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణించడంతో ప్రజారోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రకారం, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పీఎం 2.5, పీఎం 10 కణాలు అనుమతించదగిన స్థాయి కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు తాజాగా పొలూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఇది గాలి కాలుష్యం ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో సూచిస్తోంది.

సికింద్రాబాద్ లో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
ప్రభుత్వంతో పాటు ప్రజలు సైతం పొల్యూషన్ కంట్రోల్ కోసం చెయ్యాల్సిన బాధ్యతలను ఇది సూచిస్తుంది. ఇటీవల సికింద్రాబాద్ పరిధిలో గాలి నాణ్యత సూచీ అత్యంత ప్రమాదకరంగా 240కు చేరినట్లు అధికారులు తెలిపారు. పొలూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదిక ప్రకారం, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని స్పష్టంగా వెల్లడైంది. కనుక ప్రజలు కూడా కాలుష్యాన్ని నివారించేలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
కాలుష్యం పెరగటానికి కారణాలు ఇవే
వాహనాల పొగ, భారీగా జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల ఉత్పన్నమవుతున్న ధూళి, పరిశ్రమల కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి అంశాలు గాలి నాణ్యత పడిపోవడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన రద్దీతో పాటు, జరుగుతున్న నిర్మాణాల వలన కాలుష్యం గాలిలోనే నిలిచిపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్‌లో ప్రజారోగ్య సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications