ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం: ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని అరోరా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని రియాక్టర్‌లో రసాయన ప్రమాదం జరగడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బాయిలర్ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్ అవ్వడంతో అనిల్ (40) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురు కార్మికులు గోపీ(23), శ్రీనివాస్ (25), బలరామ్ (30)లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, ప్రమాదం ఉదయం జరిగితే.. మృతుడి, బాధితుల కుటుంబాలకు సంస్థ నిర్వాహకులు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఘటన విషయం బయటకు రాకుండా రహస్యంగా క్షతగాత్రులను యశోదా ఆసుపత్రికి తరలించారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ ముందు మృతుడి బంధవులు నిరసన వ్యక్తం చేశారు.
యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఫార్మా కంపెనీ నడుపుతున్న ఆరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఫార్మా కంపెనీ ముందు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు, సంస్థ యాజమాన్యం.. అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివరాంపల్లిలో అగ్ని ప్రమాదం
రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బట్టల దుకాణంలో మంటల చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కలవారు భయాందోళనలకు గురుతున్నారు. స్థానికులే మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. దుకాణ యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పైరింజిన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి.












Click it and Unblock the Notifications