హైదరాబాద్ మెట్రో షాకింగ్ నిర్ణయం: ఇక స్టేషన్లలో ఆ ఛార్జీలు కూడా వసూలు
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులకు షాకిచ్చింది. ఇకపై మెట్రో రైల్వే స్టేషన్లలోని టాయిలెట్లను ఉపయోగించుకోవాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే. ఎందుకంటే, మెట్రో రైల్ యాజమాన్యం ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
పరిశుభ్రతను మెరుగుపరచడం, సౌకర్యాలను మెరుగుపర్చే ప్రయత్నంలో, హైదరాబాద్ మెట్రో రైలు ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో టాయిలెట్లను ఉపయోగించేందుకు వినియోగదారు ఛార్జీల కొత్త విధానాన్ని గత శనివారం ప్రారంభించింది.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. సమర్థవంతమైన నిర్వహణ, ఈ ఛార్జీల సేకరణను నిర్ధారించడానికి, పబ్లిక్ వాష్‌రూమ్‌ల నిర్వహణ బాధ్యత సులభ్ ఇంటర్నేషనల్ అనే ప్రఖ్యాత పారిశుద్ధ్య సంస్థకు అప్పగించినట్లు తెలిపారు.
ఈ కొత్త విధానంలో సౌకర్యాలను వినియోగించుకోవడానికి ప్రయాణికులు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మూత్ర విసర్జనకు రూ. 2 రుసుము వసూలు చేస్తారు. మరుగుదొడ్ల వినియోగానికి రూ. 5 వసూలు చేస్తారు. అయితే, ఇప్పటి వరకు అన్ని మెట్రో స్టేషన్లలో టాయ్‌లెట్ల వినియోగం ఉచితంగానే ఉండేది. కానీ, తాజా నిర్ణయంతో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని మెట్రో ప్రయాణికులు గమనించాల్సి ఉంది. అయితే, చాలా మంది మెట్రో ప్రయాణికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు మెట్రో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని అంటున్నారు.
ఈ వేసవి కాలంలో ఎండలు మండిపోతుండటంతో ఎక్కువ మంది నగర ప్రజలు మెట్రోనే ఆశ్రయించారు. అత్యధిక స్థాయిలో మెట్రో రైళ్లలో ప్రయాణించారు. మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిలాడుతున్నాయి. ఎక్కువ మంది ప్రయాణించడంతో మెట్రోకు ఆదాయం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పలు మెట్రో కార్డులపై సబ్సిడీని ఎత్తివేయడం, ఇప్పుడు టాయెలెట్ల ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications