MMTS ఘటన.. మహిళల భద్రత విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేయబోగా అతని నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకేసింది ఆ యువతి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను దక్షిణ మధ్య రైల్వే తీవ్రంగా పరిగణించింది. మహిళల భద్రత విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలకు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందించే విధంగా MMTS రైళ్లలో పానిక్ మోడ్ బటన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఈ బటన్‌ను నొక్కిన వెంటనే ఆ సమాచారం రైల్వే పోలీసులకు చేరుతుంది. వెంటనే రైల్వే పోలీసులు తక్షణ సాయం అందించి చర్యలు తీసుకుంటారు. దీంతోపాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు రైళ్లలో సైతం పెట్రోలింగ్ నిర్వహించి మహిళా ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తాజాగా సమీక్ష జరిపారు. సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ప్రతి రైలులో ఒక రైల్వే పోలీస్ అధికారి ఉండాలని నిర్ణయించారు.
మరోవైపు ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 13 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో కదులుతున్న రైలు నుంచే యువతి కిందకు దూకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ యువతి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications