గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మరో బిగ్ న్యూస్.. ఆ మార్గంలో 6 లేన్ల ఫ్లైఓవర్
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం కోసం జిహెచ్ఎంసి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నచోట ఫ్లై ఓవర్ల నిర్మాణానికి దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరో కీలక ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది. జిహెచ్ఎంసి మైలార్ దేవ్ పల్లి నుండి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణానికి రెడీ అయింది.
ఆరు లైన్ల గ్రేడ్ సపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు
మైలార్ దేవ్ పల్లి నుండి కాటేదాన్ శంషాబాద్ రోడ్డు వరకు ఆరు లైన్ల గ్రేడ్ సపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపింది. పాతబస్తీ, కంచన్ బాగ్ , ఎల్బీనగర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల వారికి ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది.

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొత్త ఫ్లై ఓవర్
ఈ పరిస్థితి నుంచి వారిని బయట పడేయటం కోసం ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకోకుండా ఉండడం కోసం ఈ ఫ్లైఓవర్ ను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ మార్గంలో ఓవైసీ ఫ్లైఓవర్, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఉన్నాయి. అయితే మైలార్ దేవ్ పల్లి జంక్షన్ వద్ద మాత్రం నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడం కోసం కొత్త ఫ్లైఓవర్ ను నిర్మించాలని నిర్ణయించారు.
345 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు
సుమారు 345 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని, దీనికోసం పరిపాలన అనుమతులు తీసుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు. ఈ పరిపాలన అనుమతులు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులు చేపట్టడానికి జిహెచ్ఎంసి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు అధికారిక ఆమోదం కోసం ఎదురు చూస్తూనే, ప్రాజెక్టు ఆలస్యం కాకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
భూసేకరణకు ప్లాన్ చేస్తున్న జీహెచ్ఎంసీ
ఈ ఫ్లైఓవర్ పూర్తి అయితే మైలార్ దేవ్ పల్లి, కాటేదాన్ శంషాబాద్ రోడ్డు ప్రాంతాలలో నిత్యం ట్రాఫిక్ రద్దీతో నరకయాతన అనుభవించే వాహనదారులకు ఉపశమనం కలుగుతుంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ పైన కూడా జిహెచ్ఎంసి దృష్టిసారించి ప్రణాళికలు రూపొందిస్తోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే వారికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ
ఈ ప్రాజెక్టు పూర్తయితే గ్రేటర్ హైదరాబాద్ నగర దక్షిణ భాగంలో ట్రాఫిక్ నిర్వహణకు మార్గం సుగమమవుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణం చేయాలనుకునే వారికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని జిహెచ్ఎంసి భావిస్తోంది.












Click it and Unblock the Notifications