మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకరికి గాయాలు
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్బంగా నగరంలోని పలు చోట్ల కేటీఆర్ పర్యటించారు.
ఇందులో భాగంగా ఉప్పల్ నుంచి రామాంతపూర్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. వాహన శ్రేణిలో ఉన్న ఎంపీ మల్లారెడ్డి వాహనం ఢీకొని ఓ వ్యక్తి గాయపడ్డారు. దీంతో గాయాలైన వ్యక్తిని వెంటనే కామినేని ఆస్సత్రికి తరలించారు.

కండ్లకోయ జంక్షన్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మౌలిక వసతులతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ ఇంటర్ కనెక్ట్‌డ్ ఏర్పాటు చేసి.. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేస్తామని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగానే ఎస్ఆర్డీపీ కింద అండర్ పాస్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. స్కైవేల కోసం డిజైన్ల బడ్జెట్ సిద్ధంగా ఉందని చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కండ్లకోయ వద్ద 1.10కి.మీల పొడవుల గల ఈ ఎక్స్‌ప్రెస్ వేను రూ.125కోట్ల వ్యయంతో నిర్మించారు. కండ్లకోయ జంక్షన్ పూర్తవడంతో 158కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చింతలకుంట అండర్ పాస్ ప్రారంభించిన కేటీఆర్
ఎల్బీనగర్ కారిడార్‌లో భాగంగా చింతలకుంట చౌరస్తా వద్ద నిర్మించిన అండర్‌పాస్‌ను ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 18.70కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అండర్‌పాస్‌తో విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తగ్గనున్నాయి. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా అందుబాటులోకొచ్చిన ప్రాజెక్టులో ఇది మూడవది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా సుమారు రూ. 2631కోట్ల వ్యయంతో ఐదు ప్యాకేజీల్లో జంక్షన్లు, గ్రేడ్ సెపరేటర్లు, ఫ్లై ఓవర్లు తదితర 18 ప్రాజెక్టులు 2015లో జీహెచ్‌ఎంసీ చేపట్టింది.












Click it and Unblock the Notifications