పావురాలతో జర భద్రం.. ప్రాణాంతక వ్యాధులను కొనితెచ్చుకున్నట్లే..!
సాధారణంగా చాలా మంది పావురాలకు దానా వేస్తుంటారు. వాటి మధ్యలో నిలబడి ఫొటోలు దిగుతుంటారు. ఇంకొంత మంది వాటిని పెంచుకుంటూ ఉంటారు. అయితే పావురాలతో మానవులకు అనారోగ్య సమస్యలు వస్తాయని.. ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని వైద్య అధికారులు కీలక సూచనలు చేశారు. పావురాలకు దూరంగా ఉండాలని సూచించారు. వీటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.
హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో పావురాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తుంటాయి. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు.. ఇతరత్రా జనజీవన ప్రాంతాల్లో అవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే వీటి వల్ల మానవులకు జూటోనిక్ వ్యాధులు సంక్రమిస్తాయని అధ్యయనాల్లో తేలింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతాయి. పావురాల వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు, చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా అనారోగ్యం బారిన పడతారని అమెరికాకు చెందిన ఓ సంస్థ తన రిపోర్టులో పేర్కొంది.
హైదరాబాద్ లోని అనేక రద్దీ ప్రాంతాల్లో పావురాలు కనిపిస్తుంటాయి. ప్రజలు వాటికి ఉత్సాహంగా మేత వేస్తుంటారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ పత్రిక జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రజలకు పావురాలతో వచ్చే వ్యాధులపై అవగాహన లేనట్లు ఆ వార్తా పత్రిక తెలిపింది. ఇదే విషయాన్ని హైదరాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్(DMHO) వెంకట్ జుమ్మిడి ప్రస్తావించారు. పావురాలతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు పావురాలకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు.
పావురాలు ఇళ్లలోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులు మూసివేయాలని హైదరాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్(DMHO) వెంకట్ జుమ్మిడి తెలిపారు. పావురాల మలంలో అనేక మైన వైరస్, ఫంగల్, బ్యాక్టీరియల్ క్రిములు ఉంటాయని అవి శ్వాస నుంచి మానవశరీరంలోకి ప్రవేశించి తీవ్రంగా హాని కలిగిస్తాయని వెంకట్ జుమ్మిడి తెలిపారు.

ఇక పావురాల బెడదతో ఇటీవల ముంబైలోనూ అనేకమంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పావురాలు అధికంగా ఉన్న ప్రదేశాలను ధ్వంసం చేయాలని బ్రిహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) కు బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పావురాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని హైకోర్టు అభిప్రాయ పడింది.












Click it and Unblock the Notifications