బుల్డోజర్‌ను ఢీకొన్నకారు: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి ఓ తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదం మింగేసింది. సుదూరమైన డ్రైవింగ్ కలిసిన అలసట, నిద్రమత్తు అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఏడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాదులోని సైదాబాద్ ఎస్‌బిహెచ్ కాలనీకి చెందిన గుండా నితిన్ (21) ఏడాదిన్నర క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లాడు. ఒక్లహామా రాష్ట్రంలో నివసిస్తున్న బంధువుల ఇంటిలోని శుభకార్యానికి ముగ్గురు మిత్రులతో కలిసి కారులో వెళ్లాడు. దాదాపు 1,970 కిలోమీటర్లు కారు నడిపాడు.

తిరుగు ప్రయాణంలో కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత డ్రైవింగ్ వల్ల అలసిపోయిన నితిన్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో కారు ప్రధాన రహదారి ఎడమవైపున ఉన్న కన్‌స్ట్రక్షన్ జోన్‌లో పార్కు చేసి ఉన్న బుల్డోజర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నితిన్ అక్కడికక్కడే మరణించాడు.
మరో హైదరాబాద్ విద్యార్తి వివేక్ గాయపడ్డాడు. మిగతా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వివేక్‌ను మిగిలిన స్నేహితులు ముస్కోగీలోని ఈస్టర్ హెల్త్ సిస్టమ్‌లో చేర్పించారు. ప్రమాద సమయంలో కారు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు సమాచారం.
నితిన్ మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ఏకైక సంతానమైన నితిన్ లేడనే వార్త అతని తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసింది. నితిన్ మృతదేహం శనివారం హైదరాబాదుకు చేరుకునే అవకాశం ఉంది. నితిన్ ఇబ్రహీంపట్నంలోని సివీఆర్ కళాశాలోల బిటెక్ పూర్తి చేశాడు. నితిన్ తండ్రి శ్రీనివాస్ ఎస్‌బిహెచ్‌లో స్పెషల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications