ఐబీఎం టెక్కీని వెంటాడిన మృత్యువు: గుంత తప్పించబోతే, కారు దూసుకెళ్లింది
హైదరాబాద్: ఆ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీరును మృత్యువు వెంటాడింది. విధులకు వెళ్తున్న అతడు రోడ్డుపై గుంతలను తప్పించబోయి కిందపడ్డాడు. అదే సమయంలో వేగంగా వస్తున్నా కారు.. అతడ్ని ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరానికి చెందిన చిప్పగిరి గోపాల్ రెడ్డి కుమారుడు చాణక్యరెడ్డి(24) రాయదుర్గంలోని ఐబీఎం సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

కేపీహెచ్‌బీ ఫస్ట్ ఫేజ్‌లో నివాసం ఉంటున్న చాణక్యరెడ్డి.. మంగళవారం మధ్యాహ్నం తన హోండా యాక్టివాపై ఆఫీసుకు బయల్దేరాడు. మాదాపూర్ ఆర్ఓబీ సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడ్డాడు.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఇన్నోవా కారు.. చాణక్యను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతడ్ని మాదాపూర్ మాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు.
కాగా, చికిత్స పొందుతూ చాణక్య మృతి చెందాడు. ఇన్నోవా కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, చాణక్య మృతి విషయం తెలిసిన ఆయన కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications