"ఇదీ కెసిఆర్ సర్కార్ గుండాగిరి: ప్రజలపైనే పాలకుల యుద్ధం"

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రజా సమస్యలను నిరసనలు, ఆందోళనల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లేందుకు వైదికైన ధర్నాచౌక్ పరిరక్షణకు జరిగిన ప్రదర్శన రణరంగాన్నే తలపించింది. 'సేవ్ ధర్నాచౌక్' ఆందోళనకు అనుమతినిచ్చిన పోలీసు శాఖ.. కార్యక్రమానికి ఒకరోజు ముందు ధర్నాచౌక్ ఎత్తేయాలని స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ లాస్య నందిత ఆధ్వర్యంలో కాలనీ వాసుల పేరిట హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం, ఆయన శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని హితోక్తులు పలుకడం సహజసిద్ధంగా సాగిపోయాయి.

కానీ సోమవారం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున నిత్యం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మారిన 'ధర్నాచౌక్' పరిరక్షణకు సాగిన ఆందోళనను పక్కదోవ పట్టించేందుకు అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మంగా వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ దిన పత్రికలు ధర్నా చౌక్ రణరంగా మారిందని, ధర్నాయుద్ధం.. దద్దరిల్లిన ధర్నాచౌక్ అనే పతాక శీర్షికలతో వార్తాకథనాలు ప్రచురిస్తే.. అధికార టీఆర్ఎస్ పత్రిక 'నమస్తే తెలంగాణ' మాత్రం 'ఎర్రజెండాల గుండాగిరి' అనే పేరిట సరికొత్త వంటకాన్ని వండి వార్చి సబ్బండ తెలంగాణ వర్ణాల ముందు పరిచింది.

సాక్షాత్ ఒక మహిళా సీఐ సివిల్ డ్రస్‌లో ఫ్లకార్డులు పట్టుకుని ధర్నా చౌక్ ఎత్తివేత ధర్నాలో పాల్గొన్న సంగతి, ఆమెతోపాటు మరికొంత మంది మహిళా కానిస్టేబుళ్లు కూడా హాజరైన విషయం గుర్తించిన మీడియా ఫొటోలు తీయడంతోనే జారుకుని తర్వాత వారే యూనిఫామ్ వేసుకుని బందోబస్తు నిర్వహించడానికి వచ్చిన ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి. కానీ 'నమస్తే తెలంగాణ'లో మాత్రం మఫ్టీలో పోలీసులు ఉంటే తప్పేమిటని సమర్థించుకునే రీతిలో వచ్చిన వార్తాకథనం నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్లు పరోక్షంగా ప్రభుత్వమే ధర్నాచౌక్ ఎత్తివేతకు మద్దతుగా పోటీ ఆందోళనకు నాయకత్వం వహించిందని విపక్షాలు, రాజకీయ విమర్శకులు విమర్శిస్తున్నారు.

ఎర్ర జెండాల గూండాగిరిపై ఇలా

ఎర్ర జెండాల గూండాగిరిపై ఇలా

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందు ఉండే కమ్యూనిస్టు పార్టీలంటే ప్రభుత్వాధినేత కేసీఆర్‌కు ఎంత కోపమో ఆయనే చెప్పారు. వామపక్షాలకు పనీ పాటా ఏమీ లేదని ఇటీవల ఒక సమావేశంలో ఉన్నారు. సోమవారం జరిగిన ధర్నాలో కమ్యూనిస్టులతోపాటు కాంగ్రెస్, టీడీపీ, జేఏసీ ఆధ్వర్యంలోని ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. కానీ నమస్తే తెలంగాణకు మాత్రం ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా చెప్పుకొనే ఎర్రజెండాలు ఆ ప్రజల్లోని కొందరి నిరసనపై కండ్లెర్రజేశాయని రాసింది. ప్రశ్నించడం, నిరసన తెలుపడం, ఆందోళనకు దిగడం తమ హక్కేనని, ప్రజలకు ఆ అవకాశం లేదని విధ్వంసం సృష్టించాయని ఆ పత్రిక పేర్కొన్నది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఎన్టీఆర్ స్డేడియం లోపలి నుంచి రాళ్లను ఏరుకొచ్చి బస్తీవాసులపై విసిరి, వారిని ఎర్రజెండాలు తరిమేశాయని వ్యాఖ్యానించింది. స్థానికుల దైనందిన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సమస్యపై ఆందోళనకు దిగిన సామాన్యుల రక్తాన్ని కండ్లజూశాయని ‘నమస్తే తెలంగాణ' తనదైన శైలిలో మండిపడింది. కానీ మఫ్టీలో ఉన్న మహిళా పోలీసు అధికారి ‘మా ఆరోగ్యాలు కాపాడుకోనివ్వండి' అని రాసి ఉన్న ఫ్లకార్డు పట్టుకున్న ఫొటో ఇతర పత్రికల్లో ప్రచురితం కావడంతోనే అసలు సంగతి బహిర్గతమవుతుంది.

ఆందోళనలో మఫ్టీ పోలీసులు

ఆందోళనలో మఫ్టీ పోలీసులు

ఇందిరాపార్కు వద్ద మఫ్టీలో పోలీసులు ఉండడం కొత్తేమీ కాదని, ఎక్కడైనా ఆందోళనలు జరుగుతున్నపుడు యూనిఫాంతో ఉండేవారితోపాటు మఫ్టీ పోలీసులు కూడా ఉంటారని ‘నమస్తే తెలంగాణ' కథనం సారాంశం. మఫ్టీలో ఉన్న పోలీసులు విధులు నిర్వహించడానికి బదులు ధర్నాలో పాల్గొనడానికి కారణాలేమిటో ఏలిన వారికే తెలియాలి మరి. పోలీసులు మఫ్టీలో ఉన్నారంటూ కొందరు నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని బస్తీవాసులు చెప్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నామని, రక్షణ కోసం పోలీసులు వచ్చారని, అయినా తమపై దాడులు జరిగాయని స్థానికులు చెప్పారని ‘నమస్తే తెలంగాణ' పేర్కొన్నది.

లెఫ్ట్, జనసేనకు కోదండరాం జత కలిశారని అక్కసు

లెఫ్ట్, జనసేనకు కోదండరాం జత కలిశారని అక్కసు

సోమవారం జరిగిన ధర్నాలో వామపక్షాలకు కాంగ్రెస్, టీడీపీ, కొత్తగా పుట్టుకొచ్చిన జనసేనతోపాటు కోదండరాం నేతృత్వంలోని జేఏసీ కూడా తోడైందని నమస్తే తెలంగాణ కథనం. ఇందిరాపార్కులో మార్నింగ్ వాకర్లు, పార్కు చుట్టుపక్కల కాలనీల ప్రజలు సోమవారం ఉదయమే ధర్నాచౌక్ వద్దకు చేరుకుంటే, వారిని వెళ్లిపోవాలని ఎర్రజెండాల పార్టీల గూండాలు బెదిరించారని, ఏడాదిపొడవునా ధర్నాచౌక్‌లో జరిగే ఆందోళనలతో తాము విసుగెత్తిపోతున్నామని, నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నామని వారికి నచ్చజెప్పేందుకు స్థానికులు ప్రయత్నించారని నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది. ప్రశాంతత కరువై, తమ పిల్లల స్కూలు బస్సులు కూడా రాలేకపోతున్నాయని, రోజూ ఆఫీసుకు వెళ్లడం కూడా ఆలస్యమవుతున్నదని, అందుకే తాము ధర్నాచౌక్‌ను తరలించాలని కోరుతున్నామని అక్కడ ఆందోళన చేయడానికి వచ్చిన కాంగ్రెస్, ఎర్రజెండా పార్టీలు, జేఏసీ నేతలకు స్పష్టం చేసిన స్థానికులు, వాకర్ల మాటలు.. ఎర్రజెండాలు పట్టుకొని వచ్చిన గూండాల చెవికెక్కక, వారిపై దాడులకు తెగబడ్డారని వివరించింది. ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలంటూ స్థానికులు కట్టుకున్న బ్యానర్లను చింపేశారు. కుర్చీలను కసితీరా విసిరి, విరిచిపారేశారని, ధర్నా చౌక్‌ను ఆక్రమించుకుంటామంటూ వచ్చినవారు తమ ప్రాణాలను తీసేలా ఉన్నారంటూ అక్కడ బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారుల శరణుజొచ్చారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారని ‘నమస్తే తెలంగాణ' వార్తాకథనం సాగింది.

స్థానిక టీఆర్ఎస్ నేతల ఆద్వర్యంలోనే పోటీ ధర్నా

స్థానిక టీఆర్ఎస్ నేతల ఆద్వర్యంలోనే పోటీ ధర్నా

ఉదయం ఏడు గంటల వరకు ప్రశాంతంగానే ఉన్న ఇందిరాపార్కు వద్ద వాతావరణం కాసేపటికే వేడెక్కింది. 7.15 గంటలకు ఇందిరాపార్కు వాకర్స్ అసొసియేషన్, స్థానిక ఎల్‌ఐసీ కాలనీ, రోజ్‌కాలనీ బస్తీ, అంబేద్కర్‌బస్తీ, ఎల్బీగూడ బస్తీ, పూల్‌బాగ్ బస్తీ, భీమామైదాన్, దోమల్‌గూడ, బండ మైసమ్మ బస్తీవాసులు పెద్దఎత్తున తరలివచ్చి.. ధర్నాచౌక్ ప్రవేశమార్గంలో బైఠాయించారని నమస్తే తెలంగాణ పేర్కొన్నది. కానీ అధికార టీఆర్ఎస్ ముషీరాబాద్, రాంనగర్, కవాడీగూడ తదితర ప్రాంతాల టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ధర్నాలో పాల్గొన్నారని సోషల్ మీడియాలో ఫొటోలతోపాటు విమర్శలు వెల్లువెత్తాయి. సహజ సిద్ధంగా సామాన్యులు ఆందోళనకు... అందునా హింసాత్మక ఘటనలకు దూరంగా ఉంటారు. కానీ ప్రభుత్వం, పోలీసులు మాత్రం ధర్నాచౌక్ ఎత్తివేయాలని కోరుతూ స్థానికులే ఆందోళనకు దిగారన్న ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల ఖమ్మం మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగిన రైతులపై రాజద్రోహం కేసులు పెట్టిన పోలీసులు అంతటితో ఆగక వారి చేతులకు సంకెళ్లతో కోర్టుకు హాజరుపర్చడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అలాగే సోమవారం ధర్నాలో ఒక అధికారి సహా మహిళా పోలీసులు పాల్గొనడం వారికి గల ప్రభుభక్తిని తెలియజేస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.

దద్దరిల్లిన ధర్నాచౌక్ ఇలా

దద్దరిల్లిన ధర్నాచౌక్ ఇలా

‘ధర్నాయుద్ధం' అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన వార్తలో ‘ధర్నాచౌక్‌ ఆక్రమణ' ఆందోళన ఉద్రిక్తంగా మారిందని పేర్కొన్నది. ఉదయం నుంచే బైఠాయింపులు.. నిరసనలతో నినాదాలు హోరెత్తాయని తెలిపింది. భారీగా ప్రజాసంఘాలు తరలి వచ్చాయని వివరించింది. హైదరాబాద్ నగరంలోని దారులన్నీ ఇందిరాపార్క్ వైపే మళ్లాయని, మూడు నెలల తర్వాత ధర్నాచౌక్ నినాదాలతో దద్దరిల్లిందని వార్తాకథనం సాగింది. జేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సాగిందని, దానికి పోటీగా ‘ధర్నాచౌక్‌ వద్దంటూ స్థానికుల పేరుతో టీఆర్‌ఎస్‌ పోటీ ధర్నా' చేపట్టిందని తెలిపింది. పోటీ ధర్నాపై ఆందోళనకారులు దాడికి పాల్పడడంతో విధ్వంస కాండ సాగిందని తెలిపింది. ఈ పోటీ ధర్నాలో మహిళా సీఐ, పలువురు కానిస్టేబుళ్లు మఫ్టీలో ఆందోళనకు దిగారని రాసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నివారణకు పోలీసులు జరిపిన లాఠీచార్జీలో పలువురికి గాయాలయ్యాయని వివరించింది.

 సమస్యలపై స్థానికులు ఇలా

సమస్యలపై స్థానికులు ఇలా

ఇందిరా పార్క్ నుంచి ధర్నాచౌక్‌ను తరలించాల్సిందేనని స్థానికులు డిమాండ్ చేశారని నమస్తే తెలంగాణ వార్తాకథనం సాగింది. నిత్యం జరిగే ఆందోళనలు, ధర్నాలతో ఇబ్బందులు పడుతున్నామని, తరచూ ట్రాఫిక్ జామ్, వాహనాల మళ్లింపులతో తిప్పలుపడుతున్నామని బండమైసమ్మ బస్తీకి చెందిన లీల అనే మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నానని, ధర్నాచౌక్‌లో ఆందోళనలతో వారంలో నాలుగు రోజులు ఆఫీసుకు ఆలస్యం అవుతున్నదని ఎల్బీగూడ బస్తీకి చెందిన నర్సింహారెడ్డి చెప్పారు. తమ పిల్లల స్కూలు బస్సులకు కూడా తీవ్ర ఇబ్బందవుతున్నదని తెలిపారు. ధర్నాకు వచ్చేవాళ్లు మలమూత్ర విసర్జనకు ఇందిరాపార్కునే ఉపయోగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రిటైర్డ్ ఉద్యోగి మల్లేశ్ మీడియాతో చెప్పారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు పోవడానికి సైతం ఇబ్బందిగా ఉంటున్నదని స్థానిక నాయకుడు గోపాల్ తమ గోడు సెలవిచ్చారు. బస్తీవాసులు తమ గోడును మీడియాకు చెప్పుకొంటున్న క్రమంలోనే ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో తొలుత కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు వచ్చి ధర్నాకు దిగారు. అప్పటివరకు కూడా పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నదని నమస్తే తెలంగాణ తెలిపింది.

కమ్యూనిస్టుల రాకతోనే..

కమ్యూనిస్టుల రాకతోనే..


సీపీఐ, సీపీఎంల కార్యకర్తలు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ర్యాలీగా బయలుదేరి.. 9 గంటల సమయంలో ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడే కొద్దిసేపు రోడ్డుపై నిరసన తెలిపి, ధర్నాచౌక్ ప్రవేశమార్గం నుంచి లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, బస్తీవాసులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. తోపులాట, పెనుగులాట జరిగింది. మొత్తంగా ధర్నాచౌక్ ప్రాంగణం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఇరువర్గాల పోటీ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు స్థానికులపై రాళ్లు.. జెండా కర్రలను విసురుతూ దాడికి దిగారు. జెండాకర్రలతో విక్షణారహితంగా కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. లెఫ్ట్ పార్టీ నేతల దాడి.. వారి తీరుపై వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, బస్తీవాసులు నిరసన వ్యక్తంచేస్తూ అక్కడే బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎక్కడెక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చి.. స్థానికులమైన తమపైనే దాడిచేయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానికులకు కార్పొరేటర్లు లాస్యనందిత, హేమలత, ముఠా పద్మ మద్దతు పలుకగా.. ప్లకార్డులు చేతబట్టి అక్కడే ధర్నాకు దిగారు. గంటసేపు నినాదాలు.. అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.

యుద్ధభూమిని తలపించిన వైనం

యుద్ధభూమిని తలపించిన వైనం

ఇందిరా పార్కులోని ధర్నా చౌక్‌ రణరంగంగా మారిందని, ఇరు వర్గాల పరస్పర దాడులతో యుద్ధ భూమిని తలపించిందని ‘ఆంధ్రజ్యోతి' వార్తాకథనం ప్రచురించింది. ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం అఖిలపక్ష, ప్రజా సంఘాలు.. తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు పరస్పరం ఆందోళనలకు దిగడంతో దాడులతో ‘ఆక్యుపై ధర్నా చౌక్‌' ఉద్రిక్తంగా మారింది. ఇరు పక్షాలు రాళ్లు, కుర్చీలు రువ్వుకున్నాయి. ఈ ఘర్షణలో ఆందోళనకారులకు, పోలీసులకు గాయాలు అయ్యాయి. మరోవైపు పోలీసులు ఆందోళనకారులపై నాలుగు కేసులు నమోదు చేశారు. ధర్నా చౌక్‌ను కొనసాగించాలంటూ అఖిలపక్ష నేతలు, తొలగించాలంటూ స్థానిక కాలనీ, బస్తీవాసులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగడం, ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వడాలు, కుర్చీలు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు వెల్లువలా తరలి రావడం, వారిని స్థానిక బస్తీవాసులు అడ్డుకోవడంతో ఘర్షణ ముదిరింది.

ధర్నా చౌక్‌ పరిరక్షణ కమిటీ సోమవారం ‘ధర్నా చౌక్‌ ఆక్రమణ'కు కమిటీ పిలుపునిచ్చింది. ఇందుకు పోలీసుల నుంచి అనుమతి కోరినా చివరి నిమిషం వరకూ దాన్ని సస్పెన్సలో పెట్టారు. అనుమతించకపోయినా ఆక్రమణ తప్పదని పరిరక్షణ కమిటీ హెచ్చరించింది. అదే సమయంలో, ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తి వేయాలని కోరుతూ స్థానికులు, బస్తీవాసులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. వారు చేయతలపెట్టిన ఆందోళనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇందిరా పార్కు చౌరస్తాకు చేరుకున్న ఆందోళనకారులకు లోనికి వెళ్లకుండా బారికేడ్లు అడ్డుగా కనిపించడంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురై చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్ల పక్కనే కూర్చున్న కాలనీ, బస్తీవాసులు, టీఆర్‌ఎస్‌ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.

పరిరక్షణ కమిటీ కార్యకర్తలు వెనక్కు వెళ్లాలంటూ స్థానికుల ఆధ్వర్యంలోని తరలింపు అనుకూల ఆందోళనకారులు గో బ్యాక్‌ నినాదాలు చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య కవ్వింపులు మొదలై ఘర్షణకు దారి తీసింది. ధర్నాచౌక్‌ను తరలించాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శ్రీదేవి సివిల్‌ డ్రెస్‌లో ప్లకార్డులతో ధర్నాలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఆమెతోపాటు మహిళా కానిస్టేబుళ్లు 20 మంది పాల్గొన్నారు. మీడియా ఫొటోలు తీయడం గమనించిన శ్రీదేవి, మహిళా కానిస్టేబుళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులే స్వయంగా బస్తీవాసులను రెచ్చగొట్టడంతోపాటు ధర్నాలో పాల్గొనడం విడ్డూరంగా ఉందని అఖిలపక్ష నేతలు విమర్శించారు.

ధర్నాచౌక్ ఇలా రణరంగం

ధర్నాచౌక్ ఇలా రణరంగం

‘ధర్నాచౌక్‌ ఆక్రమణ'కు తరలివచ్చిన విపక్ష, ప్రజాసంఘాలు, ఐకాస కార్యకర్తల ఆందోళనతో ‘దద్ధరిల్లిన ధర్నాచౌక్' అనే శీర్షికతో ఈనాడులో వార్తాకథనం ప్రచురితమైంది. మరోవైపు ధర్నాచౌక్ ను ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు నిరసన తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య పరస్పర దాడులు, తోపులాటకు దారి తీసిందని, కుర్చీలు విరిగిపోగా ఇరు పక్షాల తలలు పగిలాయని పేర్కొన్నది. దీంతో ధర్నాచౌక్ రణరంగంగా మారిందని తెలిపింది. ధర్నాచౌక్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలను ఒకేరోజు ప్రదర్శనకు అనుమతించడం.. వామపక్ష నాయకులు, కార్యకర్తలను అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడంతో సమస్య తీవ్రమైందని తెలుస్తోంది.నిరసనలు, ఆందోళనలకు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేదికగా ఉన్న ధర్నాచౌక్‌ సోమవారం రణరంగాన్ని తలపించింది. ‘ధర్నాచౌక్‌ను పరిరక్షించండి' అంటూ ప్రజాసంఘాలు, విపక్షాలు ప్రదర్శనగా వచ్చారు. ధర్నాచౌక్‌ ఇక్కడొద్దు అంటూ స్థానికులు, వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అక్కడ అడ్డుగా బైఠాయించారు. ధర్నాచౌక్‌కు చేరుకోవాలని వామపక్ష కార్యకర్తలు ప్రయత్నించడంతో పరస్పరం తోపులాట చోటుచేసుకుంది. అనుమతిచ్చి మళ్లీ ఇదేమిటని విపక్షాలు, ప్రజాసంఘాలు, జేఏసీ నేతలు పోలీసుల్ని నిలదీశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amid heavy police barricading, the Telangana Joint Action Committee (TJAC) protestors rallied against the Telangana Rashtra Samiti government over their plan to shift the Dharna Chowk.
Please Wait while comments are loading...