ఇద్దరు కానిస్టేబుళ్లపై తల్వార్‌తో దాడి చేసిన యువకుడు, అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఏకంగా పోలీసులపైనే తల్వార్‌తో దాడికి పాల్పడ్డాడు. ఓ కేసు విషయమై దర్యాప్తు చేసేందుకు వెళ్లిన మాదాపూర్ పోలీసులపై నిందితుడు తల్వార్ తో దాడి చేయడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.
ఓ హత్య కేసు విషయమై మాదాపూర్ ఎస్ఓటీ కానిస్టేబుళ్ళు రాజు, విజయ్ లు అల్విన్ కాలనీ డివిజన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే కరణ్ సింగ్ అనే సిక్కు యువకుడు తల్వార్‌తో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రాజుకు ఛాతిపై, తలకు గాయాలయ్యాయి. విజయ్ స్వల్పంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడిన కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుళ్లను అడిషనల్ డీసీపీ రవికుమార్, డీసీపీ నారాయణ గౌడ్ పరామర్శించారు.
నిందితుడు కరణ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్వార్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాను వచ్చింది పోలీసులు అని తెలియకనే.. దాడి చేశానని నిందితుడు కరణ్ సింగ్ చెబుతున్నారు. కానిస్టేబుళ్లు సివిల్ డ్రెస్ లో రావడంతో.. వారిని శత్రువులుగా భావించి దాడి చేసినట్లు తెలిపారు.
కాగా, ఔటర్ సర్వీస్ రోడ్ మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళ్తున్న వారిపై అర్ధరాత్రి తల్వార్లతో దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో గంధంగూడకు చెందిన కిషోర్ మృతి చెందగా, తులసి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారి దగ్గర నుంచి రూ.15 వేలు నగదును తీసుకుని పరారయ్యారు. ఈ కేసు దర్యాప్తు విషయమై పోలీసులు దర్యాప్తు చేసేందుకు వెళ్లగా.. వీరిపైనా తల్వార్ దాడి జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications