హైదరాబాద్‌లో విషాదం... కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి...
హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే ఓ మహిళ మృతి చెందింది. అప్పటిదాకా హుషారుగా,సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆమె.. వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. పాతబస్తీ పరిధిలోని ఛత్రినాకలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... ఉప్పుగూడకు చెందిన పుప్పాకుల పెంటమ్మ 3 నెలల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకుంది. ఆ సమయంలో ఆమె ఎలాంటి అస్వస్థతకు గురికాలేదు. శనివారం మధ్యాహ్నం 12.51గంటలకు ఛత్రినాక కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్‌లో రెండో డోసు వేయించుకోవాల్సిందిగా ఆమె సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లిన ఆమె కోవీషీల్డ్ రెండో డోసు తీసుకుంది. అరగంట పాటు అక్కడే వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అక్కడినుంచి ఇంటికి చేరుకున్నాక... నీరసంగా ఉందని బెడ్‌పై అలా ఒరిగింది.
అంతే.. పెంటమ్మ శాశ్వత నిద్రలోకి జారుకుంది. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా ఆమె లేవలేదు. దీంతో వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పెంటమ్మ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

పెంటమ్మ మృతితో ఆమె పిల్లలు గుండెలు పగిలేలా రోధించారు.వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే తమ తల్లి మృతి చెందిందని... వ్యాక్సిన్ తీసుకోకపోయినా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెంటమ్మ భర్త ముత్తయ్య ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. వ్యాక్సిన్ వల్లే తన భార్య చనిపోయిందని... తమకు న్యాయం చేయాలని వాపోతున్నాడు.
రెండు నెలల క్రితం నగరంలోని మీర్‌పేట్‌లోనూ శ్రీపాతి నర్సింహరెడ్డి(46) అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి నర్సింహ్మారెడ్డి,అతని భార్య వాణి జిల్లెలగూడలో చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.అనంతరం బైక్‌పై సమీపంలోని తమ టైలరింగ్ షాప్‌కి వెళ్లారు. అక్కడ సెల్‌ఫోన్ చూస్తూ నర్సింహారెడ్డి ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యాక్సిన్ తీసుకున్న 45 నిమిషాల్లోనే నర్సింహారెడ్డి చనిపోవడం తీవ్ర కలకలం రేపింది.
Recommended Video
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలాంటి ఘటనలు చాలానే నమోదయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక మరణాన్ని మాత్రమే గుర్తించింది. 68 ఏళ్ల ఓ వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనఫిలాక్సిస్‌తో చనిపోయినట్లు తేల్చింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించిన 31 మందిలో కలిగిన తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ AEFI కమిటీ అధ్యయనం చేసింది. అందులో ఒక వ్యక్తి మాత్రం అనఫిలాక్సిస్ తో చనిపోయినట్లు ప్యానెల్ తేల్చింది.












Click it and Unblock the Notifications