నగరంలో 300 ఏళ్ల పురాతన మెట్ల బావి.. క్యూ కడుతున్న పర్యటకులు..
హైదరాబాద్ లో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గోల్కొండ, చార్మినార్, మక్కా మసీదు, సాలార్ జంగ్ మ్యూజియం, ఫలక్ నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టోంబ్స్ .. లాంటివి భాగ్య నగర చరిత్ర, సంస్కృతిని చాటుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల మాదిరిగానే బన్సీలాల్ పేటలోని పురాతన మెట్ల బావికి కూడా 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఈ చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న బన్సీలాల్ పేట మెట్ల బావిని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించి పర్యటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
బన్సీలాల్ పేట మెట్ల బావి ఇప్పుడు హైదరాబాద్ వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీకెండ్ టూరిజాన్ని ఇష్టపడే వారికి ఇలా వెళ్లి అలా వచ్చే విధంగా నగరానికి దగ్గరలోనే ఉండటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్ లో సాయంత్రం ఇక్కడ లైటింగ్స్ , మ్యూజిక్ కన్సర్ట్, అలాగే చిన్న, చిన్న వేడుకల కోసం సీటింగ్ తో కూడిన గార్డెన్, అంపి థియేటర్ తదితర వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. దాంతో ఇటీవలి కాలంలో ఈ ప్రాంతానికి పర్యటకుల తాకిడి పెరిగింది. వారాంతంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఇక్కడకు విచ్చేస్తున్నారు.
వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బావిని దాదాపు 40 ఏళ్లకుపైగా మట్టి దిబ్బగా మార్చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ ప్రాజెక్ట్ అనే ఎన్జీఓ సంయుక్తంగా ఈ మెట్ల బావిని రీస్టోరేషన్ చేశాయి. 2021 లోనే బన్సీలాల్ పేట్ మెట్లబావి పనులు రీ స్టోరేషన్ ప్రారంభం అయింది. దీంట్లో నుంచి దాదాపు 500 టన్నుల గార్బేజ్ ను వెలికితీశారు. ఇప్పుడు ఈ బావి రూపురేఖలను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు భాగ్య నగర వాసులకు ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా ఇది మారింది. అలాగే సంగీత కచేరీలకూ ప్రసిద్ధ వేదికగా మెట్ల బావి మారింది. టాలీవుడ్ సింగర్లు హేమచంద్రా, మంగ్లీ లాంటి వాళ్లు తమ పాటలతో పర్యాటకులకు వినోదం పంచుతున్నారు.

ఇక ఈ బావి చరిత్ర విషయానికి వస్తే.. 17వ శతాబ్దంలో అప్పటి అసఫ్ జాహీ వంశస్థులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ మెట్ల బావిని తవ్వించారు. 53 అడుగుల లోతు నుంచి ఆరు అంతస్థుల మెట్లు, మండపాలు, స్తంభాలతో ఆ బావిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ బావిలో 22 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంది. నిజాం పాలన వరకూ ఈ బావి బాగానే ఉంది. కానీ ఆ తర్వాత దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో చెత్త పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది.












Click it and Unblock the Notifications