రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్!
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా రంగం లోకి వచ్చిన నాటినుండి హైడ్రా కమిషనర్ గా ఉన్న ఏ.వి రంగనాథ్ పేరు మారు మోగిపోతుంది. హైదరాబాద్లోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కుల స్థలాలను ఆక్రమించే వారి భరతం పట్టేందుకు, ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు నాయకత్వం వహిస్తున్న ఏవి రంగనాథ్ పైన ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పొలిటికల్ ఎంట్రీపైన ఏవీ రంగనాథ్ క్లారిటీ
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా హైడ్రా కమిషనర్ పనిచేస్తున్నారని, పదవీ విరమణ తర్వాత రాజకీయాలలోకి రావాలనే ఆలోచనతోనే ఆయన ఉన్నారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏవి రంగనాథ్ తన రాజకీయ ఎంట్రీ పైన క్లారిటీ ఇచ్చారు. తనకు ఇంకా ఐదు సంవత్సరాల సర్వీస్ ఉందని, తను రాజకీయాల్లోకి వస్తున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు.

మంచి పనులు చేస్తే రాజకీయాల్లోకి రావాలా
మంచి పనులు చేస్తే రాజకీయాల్లోకి రావాలని చెప్పడం సరి కాదని స్పష్టం చేశారు. తను కాపు సంఘం సమావేశాలకు హాజరైన అంతమాత్రాన రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కాపు సంఘం సమావేశాలలో నాలుగు మంచి విషయాలు చెప్పి వస్తానని, తనకు కుల పిచ్చి మాత్రం లేదని పేర్కొన్నారు. తన కులం వారికి అనుకూలంగా వ్యవహరించడం, లేదంటే ప్రతికూలంగా వ్యవహరించడం లాంటి చర్యలకు తాను పాల్పడనని అన్నారు.
మెగా ఫ్యామిలీతో 15ఏళ్ళ పరిచయం
సొంత కులం వాళ్ళు తప్పు చేసినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఇక తనకు సినీ తారలు, క్రీడాకారులు ,గాయకులు చాలామందితో మంచి పరిచయాలు ఉన్నాయని, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా అనేక మందిని తాను కలుస్తూ ఉంటానని చెప్పారు. మెగా కుటుంబంతో తనకు 15 ఏళ్ల పరిచయం ఉందన్నారు.
వివాదాస్పద అధికారిని కాదు
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెళ్ళికి వెళ్ళిన సందర్భంగా ఆయన క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్లే అభినందించి వచ్చానని ఏవి రంగనాథ్ వెల్లడించారు. తాను ఒక రిస్క్ తీసుకునే అధికారిని కానీ, వివాదాస్పద అధికారిని కాదన్నారు. వరంగల్ ప్రీతి, మిర్యాలగూడ అమృత ప్రణయ్ వంటి కేసులపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి తను కృషి చేస్తున్నట్టు తెలిపారు.
హైడ్రాతో భావి తరాలకు లబ్ది
సమాజంలో మంచి మార్పు తీసుకురావడమే తన ఉద్దేశమని వెల్లడించారు. ఇక ఆయేషా మీద కేసును తాను దర్యాప్తు చేయలేదని, అందులో తాను తప్పు చేసినట్లు సిబిఐ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. హైడ్రా అత్యంత ప్రభావవంతమైన ఉద్యోగమని అభిప్రాయపడిన రంగనాథ్ దాని పనితీరును ఇప్పట్లో అర్థం చేసుకోలేం అన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల ద్వారా భావితరాలకు లబ్ధి జరుగుతుందన్నారు.
హైదరాబాద్లో కబ్జాలు చేసేవారిని హైడ్రా వదిలిపెట్టదు
తమ వల్ల కొందరికి నష్టం జరిగినా ఎక్కువ మందికి లాభం జరుగుతుందని, అందువల్ల తాము చేస్తున్న పని సరైనదేనని భావిస్తున్నట్టుగా తెలిపారు. హైదరాబాద్లో కబ్జాలు చేసేవారిని హైడ్రా వదిలి పెట్టదని, తాము ఎక్కడా పేదల జోలికి వెళ్లలేదని అన్నారు. అక్రమాలను వెనుక ఉండి నడిపించే వారి చేతుల్లో పావులుగా మారదని ప్రజలకు హితవు పలికారు. హైడ్రా ఉన్నంతకాలం ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేస్తామంటే కుదరదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications