పార్టీ మారుతానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రకటన: ఏ పార్టీలోకంటే?
హైదరాబాద్: తాను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పష్టం చేశారు. తనను బీఆర్ఎస్ పక్కన పెట్టిందని.. ఎమ్మెల్యే పదవి కాలం ముగిసే వరకూ ఆ పార్టీలోనే ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ నుంచే వచ్చా మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్తానన్నారు. మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పారు.
పన్నేండేళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక గొడుగు కిందకు వెళ్లకతప్పదని ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయక్ వ్యాఖ్యానించారు. దీంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టమవుతోంది.

ఆమె భర్త ఇప్పటికే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో పార్టీ మారే విషయంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేఖా నాయక్.. కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ టికెట్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఆ పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరుపుతున్నారు.
కాగా, కేసీఆర్ ఇటీవల ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో ఖానాపూర్ సీటు జాన్సన్ నాయక్‌కు ఇచ్చారు. అయితే, ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ పొందిన జాన్సన్ నాయక్ క్రిస్టియన్ అని.. ఎస్టీ కాదని రేఖా నాయక్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ టికెట్ తనదేనని చెబుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలతోనూ టచ్‌లో ఉంటున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రం ఆదిలాబాద్ ఎంపీ లేదంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం. వీటిలో ఏదో ఒక స్థానానాన్ని డిసైడ్ చేసుకోవాలని సూచంచినట్లు తెలిసింది. కానీ, తనకు ఖానాపూర్ టికెట్ కావాలని రేఖా నాయక్ పట్టుబడుతున్నారు.
కాగా, ఆసిఫాబాద్ నుంచి ఇప్పటికే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కూడా ఆ స్థానం నుంచి పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. రాజకీయ భవిష్యత్ కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నామంటున్నారు. ఇద్దరం పోటీలో ఉండాలన్నదే తన ఆలోచన అని శ్యామ్ నాయక్ అనుచరులతో చెబుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications